జీతాలు పెంచాలని గృహ కార్మికులు ఆందోళన

జీతాలు పెంచాలని గృహ కార్మికులు ఆందోళన

హైదరాబాద్, వెలుగు: కాలంతో పోటీ పడుతూ.. ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న ఉద్యోగులకు ఇంటి పనులు చేసుకోవడం కొంచెం కష్టమే. అలాంటివారికి హోం మెయిడ్(పని మనిషి) తప్పనిసరి. మొన్నటి వరకు చాలామందికి వర్క్​ఫ్రం హోం ఉంటుండడంతో ఇంటి పని చేసుకుంటూనే ఆఫీస్​ డ్యూటీ చేసేవారు. ఇప్పుడు ప్రతిఒక్కరూ ఆఫీసులకు వెళ్లాల్సి రావడంతో ఇంట్లోని పిల్లలు, వృద్ధులను చూసుకోవడం కష్టంగా ఉంటోంది. దీంతో ఇంటి పని, వంట పనుల కోసం కచ్చితంగా మెయిడ్స్​ను పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా అపార్ట్​మెంట్లలో ఉండేవారికి వీరి అవసరం పెరిగిపోయింది. 

చుట్టుపక్కల బస్తీల్లో ఉండేవారు దగ్గరలోని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్​మెంట్లలో పనికి కుదురుతున్నారు. అయితే తమకు డిమాండ్​ ఉన్నా జీతం మాత్రం10 వేలు లోపే ఉంటుందని వాపోతున్నారు. నెలకు రూ.15వేలు ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏండ్లుగా ఇదే పనిలో ఉంటున్నా కుటుంబం గడవడం కష్టంగా ఉంటోందని, ఈఎస్ఐ, పెన్షన్​సౌకర్యాలు కల్పించాలని డిమాండ్​ చేస్తున్నారు.

రోజుకు 8 గంటల పని

తమతో పనిచేయించుకుంటున్నారు కానీ జీతం పెంచడం లేదని గృహ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకి 8 గంటలకు పైగా పనిచేయించుకుంటూ చాలీచాలని జీతాలు ఇస్తున్నారని వాపోతున్నారు. కొన్నేళ్లుగా పనిచేస్తున్న, వయసు పైబడిన వారిని తీసేసి, మిడిల్​ఏజ్​వారిని పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే ఓల్డేజ్​వర్కర్లు ఎలా బతుకుతారని డొమెస్టిక్ వర్కర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం 

డబుల్ బెడ్రూం ​ఇండ్లు కేటాయించాలని, ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ సౌకర్యం కల్పించాలని కోరుతోంది. గ్రేటర్​వ్యాప్తంగా దాదాపు ఐదారు లక్షల మంది డొమెస్టిక్ వర్కర్లు ఉండగా, లక్షన్నర మందికి పైగా అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సభ్యులుగా ఉన్నారు. వీరంతా తరచూ సమావేశాలు ఏర్పాటు చేసుకుని సమస్యల పరిష్కారాలపై చర్చించుకుంటున్నారు. 


సమగ్ర చట్టం కోసం ప్రయత్నిస్తున్నం
ఇంటెడు చాకిరి చేస్తున్నా.. మాకంటూ ఎలాంటి వసతులు లేవు. మా సమస్యలు చెప్పుకునేందుకు 20 ఏండ్ల కిందట గృహ కార్మికుల సంఘం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంఘంలో ఉన్న వారు తమ ఇబ్బందులను చెబుతుంటారు. కలిసికట్టుగా పరిష్కరించుకుంటాం. ప్రస్తుతం ఒక్కొక్కరికి నెలకు 8 వేలు వరకు జీతం ఇస్తున్నారు. వాటికి 15వేలకు పెంచాలని కోరుతున్నాం. వచ్చే నెలలో ఢిల్లీలో అన్ని రాష్ట్రాలకు చెందిన డొమెస్టిక్ వర్కర్ అసోసియేషన్లు మీటింగ్ పెట్టుకోబోతున్నాయి. వాటిలో గృహ కార్మికుల కోసం సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని తీర్మానం చేయాలనుకుంటున్నాం. ఇదే పనిలో ఏండ్లుగా ఉన్నవారికి ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ, పెన్షన్, ప్రసూతి ప్రయోజనాలు మంజూరు చేయాలని కోరుతున్నాం.  -  సిస్టర్ లిస్సీ జోసెఫ్, ఫౌండర్, డొమెస్టిక్ వర్కర్స్ అసోసియేషన్

నెల గడవడం కష్టంగా ఉంది
మా పిల్లలు ఇద్దరు మమ్మల్ని వదిలేసి వారి జీవితాలు వాళ్లు చూసుకున్నారు. నేను ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్నా. జీతం రూ.8,500 ఇస్తున్నారు. వాటితో ఇంటి అద్దె, నెలంతా బతకాలంటే ఇబ్బందిగా ఉంది. అందుకే జీతం పెంచాలని ఓనర్​ను అడుగుతున్నాను.
- మణెమ్మ, డొమెస్టిక్ వర్కర్, కూకట్​పల్లి