అధ్యక్ష హోదాలో ట్రంప్ క్రిప్టో బిజినెస్.. వైట్ హౌస్‌ రీఎంట్రీతో రూ.13వేల 300 కోట్ల సంపాదన!

అధ్యక్ష హోదాలో ట్రంప్ క్రిప్టో బిజినెస్.. వైట్ హౌస్‌ రీఎంట్రీతో రూ.13వేల 300 కోట్ల సంపాదన!

అమెరికా అధ్యక్షుడిగా వైట్ హౌస్‌లో అడుగుపెట్టిన డోనాల్డ్ ట్రంప్.. కేవలం రాజకీయాల్లోనే కాకుండా సంపాదనలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. 2025లో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ట్రంప్ ఆదాయం మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోయింది. ముఖ్యంగా క్రిప్టోకరెన్సీ వ్యాపారం ద్వారా ట్రంప్ ఊహించని స్థాయిలో లాభాలను ఆర్జించారు. అమెరికా ప్రభుత్వ నైతికత విభాగం(OGE) విడుదల చేసిన తాజా వార్షిక ఆర్థిక నివేదికల ప్రకారం, ట్రంప్ మొత్తం వార్షిక ఆదాయం ఏకంగా రూ. 21వేల కోట్లకు చేరింది. గతంలో 2024లో ట్రంప్ కనీస ఆదాయం రూ.5వేల 900 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. 

ఈ భారీ ఆదాయంలో సింహభాగం క్రిప్టో వ్యాపారాల నుంచే రావడం విశేషం. ట్రంప్ తన కుమారులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల సహకారంతో కలిసి స్థాపించిన 'వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్' అనే క్రిప్టో సంస్థ ఆయనకు కాసుల వర్షం కురిపించింది. కేవలం క్రిప్టో వ్యాపారం ద్వారానే రూ.13వేల 300 కోట్లు కొత్తగా సంపాదించారు ట్రంప్. ఈ సంస్థ డిజిటల్ టోకెన్ల విక్రయాల ద్వారా ట్రంప్‌కు రూ.5వేల 600 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

►ALSO READ | ఆధార్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ సేవలు ఇకపై పూర్తిగా ఉచితం

అయితే ఈ క్రిప్టో వెంచర్ ద్వారా ప్రెసిడెంట్ ట్రంప్ ఏకంగా రూ.7వేల 600 కోట్లు ఆర్జించారని  ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం చేసిన భారీ పెట్టుబడుల ద్వారా వచ్చిన లాభాలు కూడా కలిసి ఉన్నట్లు సమాచారం. దేశాధ్యక్షుడిగా అత్యున్నత హోదాలో ఉంటూ.. ఒక వైపు క్రిప్టో పాలసీలను ప్రభావితం చేసే అవకాశం ఉండటం.. మరోవైపు అదే రంగం నుండి ఇంత భారీగా సంపాదించడం ఇప్పుడు అమెరికాలో కొత్త వివాదానికి తెరలేపింది.

అమెరికా ప్రెసిడెంట్ అధికారిక హోదాలో ఉంటూ విదేశీ ప్రభుత్వాల పెట్టుబడులతో ముడిపడిన వ్యాపారాల ద్వారా లాభాలు పొందడం Conflicts of Interest కిందికి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ విలువ పెరగడం, క్రిప్టో రంగానికి ట్రంప్ మద్దతుగా నిలవడం ట్రంప్ సొంత వ్యాపారాలకు బాగా కలిసివచ్చింది. ఏదేమైనా ఒక దేశాధ్యక్షుడు క్రిప్టో కరెన్సీ సామ్రాజ్యం ద్వారా వేల కోట్లు గడించడం అంతర్జాతీయంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది ట్రంప్ విషయంలో.