సుంకాల వివాదం ముగిసే వరకు.. వాణిజ్య చర్చలకు నో: ట్రంప్

సుంకాల వివాదం ముగిసే వరకు.. వాణిజ్య చర్చలకు నో: ట్రంప్

వాషింగ్టన్: సుంకాలపై వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్‌తో వాణిజ్య చర్చలు జరపబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం(ఆగస్టు7) అన్నారు. న్యూఢిల్లీ రష్యా చమురు కొనుగోలుపై గుర్రుగా ఉన్న ట్రంప్.. భారత ఉత్పత్తులపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా మధ్య తిరిగి చర్చలు ప్రారంభం అవుతాయా అన్న విలేకరుల ప్రశ్నలకు ట్రంప్ సమాధానమిస్తూ.. లేదు.. సుంకాలపై వివాదం పరిష్కారం అయ్యేవరకు భారత్ తో ఎటువంటి వాణిజ్య చర్చలుండవని బదులిచ్చారు.

భారత్ పై అదనంగా 25 శాతం సుంకాలను విధిస్తూ ట్రంప్ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో కొన్ని మినహాయింపులు మినహా భారతీయ ఉత్పత్తులపై విధించిన మొత్తం సుంకాలు 50 శాతానికి పెరిగాయి. ట్రంప్ విధించిన మునుపటి 25 శాతం సుంకాలు ఆగస్టు 7న అమల్లోకి వచ్చినప్పటికీ అదనపు సుంకం విధించిన 21 రోజుల తర్వాత ఆగస్టు 27 నుండి అమల్లోకి రానుంది. 

ట్రంప్ కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్.. 

సుంకాల పెంపుపై భారత్, ట్రంప్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ట్రంఫ్ తారీఫ్ లపై స్పందించిన ప్రధానిమోదీ.. రైతుల ప్రయోజనాలపై ఎప్పటికీ రాజీపడం.. వ్యక్తిగత మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినా.. వెనకడుగు వేయమని స్పష్టం చేశారు. మాకు మా రైతుల ప్రయోజనాలే మా ముఖ్యం.. రైతులు, మత్స్యకారులు,పాడి రైతుల ప్రయోజనాలపై భారతదేశం ఎప్పుడూ రాజీపడదు. దాని కోసం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నాకు తెలుసు..నేను దానికి సిద్ధంగా ఉన్నాను. .భారతదేశం దానికి సిద్ధంగా ఉంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.