డొనాల్డ్ ట్రంప్ క్రూరుడు, అబద్ధాల కోరు!

డొనాల్డ్ ట్రంప్ క్రూరుడు, అబద్ధాల కోరు!

తీవ్ర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ సోదరి బ్యారీ

రికార్డింగ్స్‌ను బయటపెట్టిన మీడియా

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్‌‌లో ఎన్నికలు జరగనున్నాయి. తాజా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ జో బిడెన్ ఇద్దరూ ప్రచార క్యాంపెయినింగ్‌ను వేగవంతం చేశారు. ఈ సమయంలో ట్రంప్‌కు ప్రత్యర్థితోపాటు సొంత కుటుంబం నుంచే పోరు మొదలైంది. ట్రంప్ క్రూరమైన, అబద్ధాలకోరని ఆయన సోదరి మర్యాన్నే ట్రంప్ బ్యారీ ఆరోపించడమే దీనికి నిదర్శనం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పనికిరాని వ్యక్తి అంటూ ఆమె వ్యాఖ్యానించింది. ట్రంప్‌ విధానాలను నమ్మలేమంటూ బ్యారే చేసిన వ్యాఖ్యలను సీక్రెట్‌గా రికార్డింగ్ చేశారు. వీటిని అమెరికన్ మీడియా శనివారం పబ్లిష్‌ చేసింది.

పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేసి నిర్బంధ కేంద్రాలకు పంపే ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై బ్యారీ మండిపడ్డారు. ఆయన కేవలం తన బేస్‌కు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారంటూ బేరీ మాట్లాడిన ఆడియో రికార్డింగ్స్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్‌ను వాషింగ్టన్ పోస్ట్‌ బయటపెట్టింది. ట్రంప్‌కు ఎలాంటి విధానాలు లేవని వెల్లడించింది. ఆయన ట్వీట్టు అబద్ధాలంటూ బ్యారే కామెంట్ చేశారు. ట్రంప్ మీద వ్యతిరేకతను బ్యారీ ఇప్పటివరకు బహిరంగంగా బయట పెట్టకపోవడం గమనార్హం. ‘టూ మచ్ అండ్ నెవర్ ఎనఫ్: హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్ ది వరల్డ్స్‌ డేంజరస్ మ్యాన్’ అనే పేరుతో ట్రంప్ మేనకోడలు మేరీ లియా ట్రంప్ ఓ పుస్తకం రాశారు. ఇది గత నెలలో ప్రచురితమైంది. ఆ టైమ్‌లో ట్రంప్‌పై బ్యారీ చేసిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇవి ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపు అవకాశాలపై ఎంత మేర ప్రభావం చూపిస్తాయో వేచి చూడాల్సిందే.