కర్మన్ ఘాట్‌ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో దేవుడి విరాళాలకే ఎసరు!

కర్మన్ ఘాట్‌ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో దేవుడి విరాళాలకే ఎసరు!
  • దాతలు ఇచ్చిన పైసలు స్వాహా చేసిన ధర్మకర్మ
  • బెదిరించి వసూళ్లు చేస్తున్న ఇంకొందరు ధర్మకర్తలు  
  • ఈవోకు మాజీ ధర్మకర్తల ఫిర్యాదు 

దిల్ సుఖ్ నగర్, వెలుగు: కర్మన్ ఘాట్‌ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో దాతలు ఇచ్చిన విరాళాలను ధర్మకర్తలు కాజేస్తున్నారని, మరికొందరు ధర్మకర్తలు అక్రమాలకు పాల్పడుతున్నారని, విచారణ జరిపించాలని మాజీ ధర్మకర్తలు సతీశ్ గౌడ్, మల్లేశ్ గౌడ్, యాదిరెడ్డి, భక్తులు ఈవోకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారులు మాట్లాడుతూ 3 నెలల క్రితం ఒక దాత ఇచ్చిన రూ.లక్షను ఓ ధర్మకర్త సొంతానికి వాడుకున్నాడని, ఈ విషయం తెలిసి దాత నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. 

అలాగే పార్కింగ్ నిర్వాహకుడితోపాటు కొబ్బరి చిప్పలు సేకరించుకునే వారి నుంచి ఇద్దరు ధర్మకర్తలు బలవంతంగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఓ అర్చకుడి నుంచి డైరీలు ముద్రిస్తామని రూ.40 వేలు వసూలు చేశారన్నారు. అర్చకులకు మంచి ఆదాయం వచ్చే ఉప ఆలయాల్లో డ్యూటీలు వేస్తామని రూ. లక్ష చొప్పున వసూలు చేశారన్నారు. 

దీనికంతటికీ ఆలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ మధ్యవర్తిగా వ్యవహరించారన్నారు. ఆలయ చైర్మన్, ఈవో అలసత్వం వల్లే విరాళాలు పక్కదారి పడుతున్నాయన్నారు. ఈఓ ఇష్టం వచ్చినప్పుడు టెంపుల్​కు వస్తున్నారన్నారు.  కాగా, దీనిపై ఈవో లావణ్య మాట్లాడుతూ విరాళాలను దుర్వినియోగం చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరుపుతామన్నారు.