దొంగ మనసులు దోచాడా?

దొంగ మనసులు దోచాడా?

‘ఖైదీ’గా తిరుగులేని విజయాన్ని అందుకున్న తర్వాత ‘దొంగ’గా పలకరించడానికి శుక్రవారం వచ్చాడు కార్తి. ‘దృశ్యం’ లాంటి మైండ్‌ గేమ్‌ మూవీని అద్భుతంగా తీసిన జీతూ జోసెఫ్ దర్శకుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఈ దొంగ ఆ అంచనాలను అందుకున్నాడా? అందరి మనసులనూ దోచుకున్నాడా?

కథ

చిన్నతనంలోనే చెడు అలవాట్లకు బానిసవుతాడు శర్వా (కార్తి). తన పుట్టినరోజు నాడు హఠాత్తుగా కుటుంబానికి దూరమవు తాడు. పదిహేనేళ్ల పాటు అతని తండ్రి (సత్యరాజ్), అక్క (జ్యోతిక) వెతుకులాడిన తర్వాత .. శర్వా గోవాలో ఓ దొంగగా బతుకుతున్నాడని తెలిసి పోలీసుల సాయంతో ఇంటికి తెచ్చుకుంటారు. అయితే అతడు నిజంగా శర్వా కాదు. ఒక పోలీసుతో కుమ్మక్కయ్యి శర్వా స్థానంలోకి వస్తాడు. ఆ విషయం ఇంట్లోవాళ్లకి తెలుస్తుందా, ఇతను ఫ్రాడ్ అయితే అసలు శర్వా ఏమయ్యాడు, చివరికి ఏం జరిగింది అనేది తెరమీద చూడాల్సిందే.

విశ్లేషణ

పాయింట్ చిన్నదైనా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి, చెప్పలేనంత ఆసక్తి రేపి, చివరికి ఎవరూ ఊహించని ముగింపునివ్వడంతో జీతూ జోసెఫ్‌‌ని మించినవాళ్లు లేరు. ఈ సినిమాకి కూడా అదే స్ట్రాటజీని ఫాలో అయ్యాడాయన. హీరో ఒక ఫ్రాడ్ అని మనకి ముందే చెప్పేస్తాడు. కానీ అతను నిజమైన శర్వా కాదని ఎప్పుడు బయటపడిపోతుందో, పడితే ఏమవుతుందో అనే టెన్షన్‌‌తో ప్రేక్షకుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. మధ్యమధ్యలో ఊహకి అందని ఓ మలుపులు ఇచ్చుకుంటూ ఆసక్తిని మరింత పెంచే ప్రయత్నం చేస్తాడు. కార్తి కామెడీ టైమింగ్.. సత్యరాజ్, జ్యోతిక లాంటి వారి పర్‌‌‌‌ఫార్మెన్స్‌‌ని చక్కగా వాడుకుంటూ కథను అందంగా నడుపుకుంటూ పోయాడు. అయితే స్క్రీన్‌‌ ప్లే కాస్త స్లోగా ఉండటం వల్ల సినిమా మెల్లగా నడుస్తున్న ఫీలింగ్​ వస్తుంది. నిజానికి మొదట స్లోగా మొదలైన సినిమా తర్వాత మంచి టర్న్‌‌ తీసుకుంటుంది. ఇంటర్వెల్‌‌ వరకూ బాగానే సాగిపోతుంది. సెకెండాఫ్‌‌లో ఎంటర్‌‌‌‌టైన్మెంట్ లేకుండా ఫుల్ సీరియస్‌‌గా ఉండటం వల్ల తెలుగు ప్రేక్షకులు కాస్త డిజప్పాయింట్ అయ్యి ల్యాగ్​ ఫీలయ్యే చాన్సుంది. కానీ సస్పెన్స్ రివీల్ కాకుండా కథను నడిపించిన విధానం ప్రేక్షకుడిని చివరి వరకూ కూర్చోబెడుతుంది.
ద్వితీయార్థంలో మరి కాస్త కామెడీ టచ్ కానీ, రొమాంటిక్ టచ్ కానీ ఇచ్చివుంటే మాస్ ప్రేక్ష
కుల్ని కూడా ఆకట్టుకుని ఉండేది.

ఎవరెలా?

నటుడిగా కార్తి ఎప్పుడో ప్రూవ్ చేసేసుకున్నాడు. అతడికి ఈ పాత్ర పెద్ద కష్టమేమీ కాదు. తనదైన శైలిలో ఈజీగా చేసుకుంటూ పోయాడు. జ్యోతిక రోల్‌‌ ఊహించినంత లేదు. ఉన్న కొద్ది బలమైన సన్నివేశాల్లో మాత్రం బెస్ట్ ఇచ్చింది. ఇక సత్య రాజ్‌‌ ఎప్పటిలాగే అదరగొట్టేశారు. డైలాగ్స్‌‌ లేకపోయినా షావుకారు జానకి తన హావభావాలతోనే మెప్పించారు. హీరోయిన్‌‌ నిఖిలకి తన టాలెంట్​ చూపించే స్కోప్ పెద్దగా లేకపోయింది. మిగతా పాత్రధారులు ఫర్వాలేదనిపించారు.

టెక్నికల్‌‌గా కూడా సినిమాకి మంచి మార్కులే పడతాయి. గోవింద వసంత మ్యూజిక్ బానే ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హిల్ ఏరియా కావడంతో అందమైన విజువల్స్‌‌ ఇచ్చే అవకాశం దొరికింది. మరో ఇద్దరితో కలిసి దర్శకుడు రాసిన స్క్రీన్‌‌ ప్లేని మెచ్చుకుని తీరాలి. ఒక్కొక్క లేయర్ విడిపోతూ వెళ్లేలా రాసిన విధానం సూపర్ అనిపిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌‌ మీద దృష్టి పెట్టకపోవడం వల్ల దొంగ కాస్త డల్ అనిపిస్తాడు తప్ప, మంచి థ్రిల్లర్‌‌‌‌ని చూసిన అనుభూతినైతే కలిగిస్తాడు.