నడిగడ్డ తండావాసులను ఇబ్బంది పెట్టొద్దు ..జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్

నడిగడ్డ తండావాసులను ఇబ్బంది పెట్టొద్దు ..జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్

మియాపూర్, వెలుగు: మియాపూర్​నడిగడ్డ తండా వాసులను సీఆర్పీఎఫ్, కస్టోడియన్​అధికారులు ఇబ్బంది పెట్టొద్దని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్​హుస్సేన్​నాయక్ ​అన్నారు. సీఆర్పీఎఫ్​ అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తండా వాసులు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఆయన నడిగడ్డ తాండాను​ సందర్శించారు. స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆస్తుల కోసం పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దని చెప్పారు. తండా లోపలికి ఎట్టిపరిస్థితుల్లోనూ సీఆర్పీఎఫ్, కస్టోడియన్ అధికారులు, సిబ్బంది వెళ్లొద్దన్నారు. వీలైతే నివాసాలు ఉండే ప్రాంతం వరకు హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేసి మిగతా స్థలాన్ని రక్షించాలని చెప్పారు. ఇందుకు సంబంధించి వారంలోగా తనకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 

పేదలకు సేవ చేయాలన్న తపన ఉండాలి 

మేడ్చల్ కలెక్టరేట్ : అధికారులకు పేదలకు సేవ చేయాలన్న తపన ఉండాలని హుస్సేన్ నాయక్ అన్నారు. సోమవారం మీర్ పేట్ మండలం దేవరయంజాల్ లోని సేవాలాల్ తండాను కలెక్టర్ మను చౌదరితో కలిసి సందర్శించారు. తండాలో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆయా అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని కలెక్టర్ తెలిపారు.