ఆర్టీసీ బిల్లుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: తమిళిసై

ఆర్టీసీ బిల్లుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: తమిళిసై
  • న్యాయ శాఖ ఒపీనియన్ మేరకు నిర్ణయం తీసుకుంటా: తమిళిసై 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ విలీన బిల్లుపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఉద్యోగులు నమ్మొద్దని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్ భవన్​లో పెండింగ్​లో ఉన్న బిల్లులపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆర్టీసీ విలీన బిల్లుతోపాటు మరో 4 బిల్లులను ఒపీనియన్ కోసం న్యాయ శాఖ సెక్రటరీకి పంపుతున్నట్లు వెల్లడించారు. న్యాయ శాఖ సెక్రటరీ ఒపీనియన్, రెకమండేషన్స్​కు అనుగుణంగా ఆర్టీసీ బిల్లుతో పాటు మరో 4 బిల్లులపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.
 గురువారం ఈ మేరకు రాజ్ భవన్ ప్రెస్ సెక్రటరీ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. రూల్స్ ప్రకారం ఒపీనియన్ తీసుకోవడం సాధారణ విషయమేనని నోట్​లో పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు ఉద్యోగులు, కార్మికులు, యూనియన్ల నుంచి వచ్చిన సలహాలు, సూచనలకు అనుగుణంగా బిల్లుకు అనుమతి ఇచ్చే టైమ్ లో 10 సిఫార్సులను సూచించానని గవర్నర్ తెలిపారు. 
తాను చేసిన సిఫార్సులు, వాటిపై వివరణలు ఈ బిల్లులో ఉన్నాయా? లేదా? అన్న అంశాలను పరిశీలించాలన్నారు. ఆర్టీసీ బిల్లును ఆమోదించకుండా  అడ్డకుంటున్నారని, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపుతున్నారంటూ ప్రింట్, ఎలక్ర్టానిక్, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, దానిని ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు నమ్మవద్దని గవర్నర్ కోరారు. 
కాగా, ఆర్టీసీ బిల్లుతో పాటు మున్సిపల్ బిల్లు, ప్రైవేట్ వర్సిటీల బిల్లు, పంచాయతీ రాజ్ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ బిల్లులను ఇటీవల అసెంబ్లీ, మండలి రెండోసారి పాస్ చేసి గవర్నర్ ఆమోదానికి పంపాయి.