మా తలపై తుపాకీ పెడితే ఒప్పందాలు చేసుకోం: ట్రంప్‏కు పీయూష్ గోయల్ కౌంటర్..!

మా తలపై తుపాకీ పెడితే ఒప్పందాలు చేసుకోం: ట్రంప్‏కు పీయూష్ గోయల్ కౌంటర్..!

న్యూఢిల్లీ: అమెరికా-భారత్‌ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, ఇండియాపై సుంకాల పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలు దువ్వుతోన్న వేళ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఎవరి ఒత్తిడికి తలొగ్గి తొందరపడి ఒప్పందాలు చేసుకోదని.. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ట్రేడ్ డీల్స్ మాత్రమే చేసుకుంటుందని స్పష్టం చేశారు. మా తలపై తుపాకీ పెడితే ఒప్పందాలు చేసుకోబోమని తేల్చి చెప్పారు.

 శుక్రవారం (అక్టోబర్ 24) జర్మనీలో జరిగిన బెర్లిన్ డైలాగ్‌లో పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్, యూఎస్‎తో సహా పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై ఇండియా చురుగ్గా చర్చలు జరుపుతోందని తెలిపారు. అయితే.. వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్‌ ఎవరి ఒత్తిడికీ తలొగ్గదని.. హడావిడి నిర్ణయాలు తీసుకోబోదని తమ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. 

వాణిజ్య ఒప్పందాలను స్వల్పకాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ఆయన అన్నారు. అధిక సుంకాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి భారత్ కొత్త మార్కెట్లను అన్వేషిస్తోందని పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు. భారత వాణిజ్య విధానం ఎల్లప్పుడూ దాని జాతీయ ప్రయోజనాలపైనే ఆధారపడి ఉంటుందని.. అంతేతప్ప మరే ఇతర అంశాల ఆధారంగా ట్రేడ్ డీల్స్ చేసుకోబోమని కుండబద్దలు కొట్టారు. 

మేం ఏ దేశంతో వ్యాపారం చేయాలి.. ఏ దేశంతో వాణిజ్యం చేయొద్దనేది ఇతరుల డిసైడ్ చేయడాన్ని భారత్ ఎప్పటికీ అంగీకరించదని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారత్‌ పలు వ్యూహాత్మక విధానాలను అనుసరిస్తోందన్నారు. కాగా, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు నిలిపివేయాలని ట్రంప్ భారత్‎ను ఒత్తిడి చేస్తోన్న వేళ పీయూష్ గోయల్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.