
కేసుల నమోదుకు సంబంధించి గైడ్‌లైన్స్ జారీ
హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో పెట్టే పొలిటికల్ పోస్టుల ఆధారంగా కేసులు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. కేవలం రాజకీయంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న కారణంతో క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇలాంటి పోస్టులకు సంబంధించి అందిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసేముందు ప్రాథమిక విచారణ చేపట్టాలని.. పరువు నష్టం, ద్వేషపూరిత ప్రసంగం, హింసను ప్రేరేపించడం, శాంతి భద్రతలకు భంగం కలిగించడం లాంటి ఆరోపణలకు సంబంధించి ఆధారాలుంటేనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని ఆదేశించింది.
రాజకీయ విమర్శ ఎంత ఘాటుగా ఉన్నప్పటికీ, నేరారోపణ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదుల ఆధారంగా రామగుండం, కరీంనగర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన మూడు కేసులను కొట్టివేయాలంటూ నల్లబాలు అలియాస్ దుర్గం శశిధర్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ ఎన్.తుకారాంజీ బుధవారం తీర్పు వెలువరించారు. నల్లబాలుపై నమోదైన కేసులను కొట్టివేస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి కేసుల నమోదుపై పోలీసులు, మేజిస్ట్రేట్ కోర్టులకు కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేశారు.
ఇవీ గైడ్‌లైన్స్..
ట్వీట్‌లు చట్టబద్ధమైన రాజకీయ వ్యక్తీకరణ పరిధిలోకి వస్తాయని కోర్టు భావిస్తున్నదని జడ్జి పేర్కొన్నారు. ‘‘పరువు నష్టం కలిగిందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేస్తే.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ముందు ఫిర్యాదుదారు బాధిత వ్యక్తినా? కాదా? అనేది పోలీసులు ధ్రువీకరించుకోవాలి. తీవ్రమైన నేరాల సమయంలో తప్ప.. పోస్టులతో సంబంధం లేని ఇతరుల తరఫున చేసిన ఫిర్యాదులు విచారణార్హం కాదు. ఏదైనా ఫిర్యాదు అందినప్పుడు, అది తీవ్రమైన నేరమైనప్పుడు కేసు నమోదుకు ముందు పోలీసులు ప్రాథమిక విచారణ జరపాలి. అందులో చట్టబద్ధమైన అంశాలున్నాయో లేదో నిర్ధారించిన తర్వాతే కేసు నమోదుపై ముందుకెళ్లాలి.
హింస, ద్వేషం, అశాంతిని ప్రేరేపించే అంశాలకు ప్రాథమిక ఆధారాలుంటే తప్ప.. వీటికి సంబంధించిన కేసులు నమోదు చేయవద్దు. రాజకీయ ప్రసంగం గానీ, పోస్టు గానీ హింసను ప్రేరేపించేలా? లేదా శాంతి భద్రతలకు తక్షణ ముప్పు కలిగించేలా ఉన్నప్పుడు మాత్రమే కేసులు నమోదు చేయవచ్చు. పరువు నష్టానికి సంబంధించి పోలీసులు నేరుగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయరాదు. సంబంధిత మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించమని ఫిర్యాదుదారుకు చెప్పాలి.
రాజకీయ ప్రసంగం/పోస్టు లేదంటే ఇతర సున్నితమైన వ్యక్తీకరణకు సంబంధించి చట్టబద్ధంగా చర్యలుండేలా చూసుకోవాలి. ఇలాంటి వాటిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయాన్ని తీసుకోవాలి. రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదు, పనికిమాలినదని తేలితే దర్యాప్తునకు కారణాలు లేవంటూ పోలీసులు కేసును మూసివేయాలి” అని తీర్పులో పేర్కొన్నారు.