
హైదరాబాద్, వెలుగు: నేర చరిత్ర ఉన్నవారికి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్లు ఇవ్వొద్దని సీఎం కేసీఆర్ ను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) సెక్రటరీ పద్మనాభరెడ్డి కోరారు. విద్యావంతులకు, నేరచరిత్ర లేనివారికి పార్టీ టికెట్ ఇవ్వాలని కోరారు. గురువారం ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు. ఎన్నికల్లో గెలవటానికి అన్ని పార్టీలు క్రిమినల్ కేసులు ఉన్నవారికి టికెట్లు ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్లో చట్ట సభల్లో నేరచరిత్ర ఉన్నవారు మాత్రమే ఉంటారన్నారు.
అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే అంశంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను ఫాలో కావాలన్నారు. నామినేషన్ దాఖలు చేసే ముందు రిటర్నింగ్ ఆఫీసర్ కు ఇచ్చే అఫిడవిట్ లో కేసులను ప్రస్తావించటం లేదని పద్మనాభరెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచాక ఆ కేసుల విచారణ జరగటం లేదన్నారు.