ఈ ఆరు విషయాల్లో నవ్వుతూ సరదాగా జోకేస్తున్నార్లే అని లైట్ తీస్కుంటే మీ ఫ్యామిలీషిప్ నట్టేట మునిగినట్టే !

ఈ ఆరు విషయాల్లో నవ్వుతూ సరదాగా జోకేస్తున్నార్లే అని లైట్ తీస్కుంటే మీ ఫ్యామిలీషిప్ నట్టేట మునిగినట్టే !

కుటుంబ సభ్యులు సరదాగా మాట్లాడుకోవడం, జోకులేసుకోవడం సర్వ సాధారణం. ఒక ఫ్యామిలీ అనేది అన్యోన్యంగా ఉండాలంటే ఈ మాత్రం స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. అయితే.. కొన్నిసార్లు ఇలా సరదాగా మాట్లాడే మాటల్లో.. బయటకు చెప్పుకోలేని వాళ్ల బాధలు, సమస్యలు కూడా కలిపి చెప్తారని చాలా మంది గ్రహించడం లేదు.

అందువల్ల.. ఫ్యామిలీలో కొందరి బాధలు ఎప్పటికీ తీరని వెతలుగానే మిగిలిపోతున్నాయి. ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు గానీ రోజులు గడిచే కొద్దీ కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి నిర్లక్ష్యం గొడవలకు దారితీస్తుంది. అందువల్ల.. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు, అనుబంధాలు చెడకుండా ఉండాలంటే.. ఈ ఆరు విషయాలను ఎప్పుడూ లైట్ తీసుకోవద్దు. అవేంటో చూద్దాం..

1. కుటుంబ సభ్యులలో ఎవరైనా.. ముఖ్యంగా ఇంటి ఖర్చులను చూసుకునే వారు.. పలుమార్లు "నా దగ్గర రూపాయి మిగలలేదు" లేదా "మనం దివాళా తీసినట్టే" అని సరదాగా అంటే.. ఆ కామెంట్స్ను తోటి కుటుంబ సభ్యులు జోక్గా తీసుకోవద్దు. ఆర్థిక సమస్యలను, అప్పులను గురించి కుటుంబ సభ్యులందరితో అందరూ నేరుగా చెప్పుకోలేరు. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అంతా సరదాగా సమయం గడుపుతున్న సమయంలోనే సరదా సంభాషణలో కుటుంబ సభ్యులకు పరోక్షంగా కుటుంబ ఆర్థిక పరిస్థితిని వ్యక్తపరుస్తారు. ఇలాంటి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోండి. వృధా ఖర్చులను, దుబారాలను, షికార్లను తగ్గించుకుని ఇంటి ఆర్థిక పరిస్థితిని అప్పటి నుంచైనా బడ్జెట్ ప్రకారం ఇబ్బంది లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి.

►ALSO READ | 13 గుండెలు.. 360 డిగ్రీ వ్యూ.. ఊపిరితిత్తులు లేకుండానే శ్వాస.. మెడ తెగినా రక్తం కారదు.. బొద్దింకల గురించి.. షాకింగ్ ఫ్యాక్ట్స్

2. "ఈ మధ్య నా ఒంట్లో సత్తువ లేకుండా పోతుంది.. ఓపిక ఉండటం లేదు.. శరీరం సహకరించడం లేదు" లేదా "నా నడుము విరిగింది" లాంటి మాటలను కుటుంబంలో ఎవరైనా అంటే.. వయసు మీద పడుతున్న సమయంలో ఉండే లక్షణాలుగా లేదా రోజంతా అలసిపోవడం వల్ల ఉండే సమస్యలుగా కొట్టిపారేస్తుంటారు. విశ్రాంతి తీసుకుంటే అంతా సెట్ అయిపోతుందని భావిస్తుంటారు. కానీ.. ఫ్యామిలీలో ఎవరైనా ఈ మాటలను పదేపదే చెబుతుంటే.. వాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అర్థం. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని ఇలా చెప్తున్నారని అర్థం చేసుకోవాలి. వారికి తగిన వైద్యం చేయించాలి.

3. "నీకు ఫోన్‌తో గడపడానికే టైం ఉంది.. నాతో కాసేపు కూడా సరదాగా గడిపేందుకు ఆసక్తి చూపించడం లేదు" అని మీ భాగస్వామి.. స్నేహితులు లేదా బంధువుల ముందు నవ్వుతూ అంటే మాత్రం మీ వైఖరి మార్చుకోవాలని సంకేతం ఇచ్చినట్లే. ఇది మామూలు జోక్ కాదు.. భాగస్వామి ఒంటరిగా ఫీల్ అవుతుందని చెప్పడానికి ఇలాంటి వ్యాఖ్యలు నిదర్శనం. ఉమ్మడి కుటుంబాలు అరుదుగా కనిపిస్తున్న ఈరోజుల్లో భార్యకు భర్త, భర్తకు భార్యనే తోడు. పిల్లలు ఇంట్లో ఉన్నా భాగస్వామితో సమయం గడపడం దాంపత్య బంధం బలహీనపడకుండా ఉండేందుకు ఎంతో ముఖ్యం. అందువల్ల.. వైవాహిక బంధంలో దూరం పెరగకుండా ఉండాలంటే ఇలాంటి మాటలను లైట్ తీసుకోవద్దు. భాగస్వామితో సమయం గడిపేందుకు ప్రయత్నించండి. ఒకవేళ బిజీలో ఉండి సమయం వెచ్చించలేని పరిస్థితి ఉంటే.. అర్థమయ్యేలా చెప్పండి. అప్పుడే దాంపత్య బంధం బీటలు వారకుండా ఉంటుంది.

4. ఇంట్లో వాళ్లు గతంలో మనం చేసిన తప్పులపై, పొరపాట్లపై నవ్వుతూనే సెటైర్లు పేల్చుతుంటారు. ‘‘వాడు ఆ ఉద్యోగాన్ని వదిలేయొద్దని చెప్తే వినలేదు’’, ‘‘ఆ సంబంధం వద్దనుకుని తప్పు చేశాడు’’ ఇలా.. ఇంట్లో వాళ్ళు గతంలో చేసిన తప్పులను లేదా పొరపాట్లను గుర్తుచేస్తూ సమయం.. సందర్భం వచ్చినప్పుడు ఎగతాళి చేస్తుంటారు. మొదట అది తమాషాలా అనిపించవచ్చు. కానీ అది విషయాన్ని టైం చూసుకుని పదేపదే గుర్తుచేస్తుంటే మాత్రం.. మనస్పర్థలు ఇంకా తొలగిపోలేదని అర్థం. ఈ అలవాటు.. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలను మరింత పెంచుతుంది. ఎందుకు ఉద్యోగాన్ని వదిలేశామో, ఎందుకు ఒక సంబంధం వస్తే నచ్చలేదని చెప్పామో అర్థం చేసుకునే విధంగా నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి.

5. పిల్లలు ఈ మధ్య మొబైల్ ఫోన్లకు, టీవీకి బాగా అలవాటుపడ్డారు. కానీ.. కొన్ని సందర్భాల్లో పిల్లలు సరదాగా "నేను పనికిరానివాడిని" లేదా "నన్ను ఎవరూ ఇష్టపడరు" అని అంటుంటారు. ఈ మాటలను పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఇవి లైట్ తీస్కుంటే.. పిల్లల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లలు ఒంటరితనానికి అలవాటుపడతారు. తోటి పిల్లలతో గొడవలు పడే తత్వం పెరుగుతుంది. వాళ్లతో ప్రేమగా మాట్లాడండి. వారి మనసులో ఏముందో అర్థం చేసుకోండి.

6. కుటుంబంలోని వయసైపోయిన పెద్దవాళ్లు.. కొన్ని సార్లు "మా టైం అయిపోయింది" లేదా "ఇంట్లో మేము పనికిరాని వాళ్ళం" అని సరదాగా అంటే.. నవ్వి వదిలేయకండి. వారి గుండెల్లో లోతుగా ఉన్న ఒంటరితనం తాలూకూ మాటలుగా అర్థం చేసుకోండి. వయసు మీద పడిన సందర్భంలో.. ఇక తమకు విలువ ఇవ్వరని.. తమ ఇంపార్టెన్స్ తగ్గిపోయిందని పెద్దవాళ్లు బాధపడుతుంటారు. ఇలాంటి సమయాల్లో.. వారితో సమయం గడపండి. తగిన గౌరవం ఇవ్వండి. వయసైపోయాక కృష్ణా.. రామా అని ఒక మూలన కూర్చోక ప్రతీ విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావని కసురుకోకండి.