ఫిట్‌‌గా ఉన్నా ఎందుకు ఎంపిక చేయలేదు.. రోహిత్ సెలక్షన్‌‌పై వివాదం

ఫిట్‌‌గా ఉన్నా ఎందుకు ఎంపిక చేయలేదు.. రోహిత్ సెలక్షన్‌‌పై వివాదం

న్యూఢిల్లీ: రాబోయే ఆస్ట్రేలియా సిరీస్‌‌కు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను సెలక్ట్ చేయకపోవడంపై వివాదం నడుస్తోంది. గాయం పేరుతో రోహిత్‌‌ను ఆసీస్ టూర్‌‌కు ఎంపిక చేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మంగళవారం సన్ రైజర్స్ హైదరాబాద్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో రోహిత్ ఆడటంతో సెలక్షన్ కమిటీపై నెగిటివ్ కామెంట్స్ ఊపందుకున్నాయి. రోహిత్ సెలక్షన్‌‌ గురించి తనకు ఏ విషయమూ తెలియదని, తాను సెలెక్షన్ కమిటీలో భాగం కాదంటూ ఈ విషయంపై భారత్ హెడ్ కోచ్ రవిశాస్త్రి కామెంట్ చేశాడు. దీనిపై వెటరన్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా స్పందించాడు. రోహిత్ సెలక్షన్ గురించి రవిశాస్త్రికి తెలియకపోవడం ఏంటంటూ ప్రశ్నించాడు.

‘రోహిత్ శర్మ పరిస్థితి ఏంటనేది రవిశాస్త్రికి తెలియకుండా ఎలా ఉంటుంది. ఆయన సెలక్షన్ కమిటీలో భాగం కాకపోయినా.. జట్టు ఎంపికకు రెండ్రోజుల ముందు రోహిత్ గురించి రవిశాస్త్రితో మాట్లాడే ఉంటారు. అలాగే అతడి సలహాలు, సూచనలు తప్పక తీసుకొని ఉండొచ్చు. రవిశాస్త్రి స్టేట్‌‌మెంట్‌‌తో నేను అంగీకరించను. టీమ్‌‌లో ఎవరు ఉండాలనే విషయంపై కోచ్, కెప్టెన్ అనధికారికంగానైనా చర్చించుకుంటారు. ఫ్రాంచైజీకి ఆడటానికి రెడీగా ఉన్న ప్లేయర్‌‌ను దేశానికి ఆడించకపోవడం ఏంటి? ఇది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఇది ముమ్మాటికీ బీసీసీఐ తప్పే. రోహిత్‌‌ను టీమ్‌‌లో సెలక్ట్ చేశాక, అతడికి ఇంజ్యురీ అయితే రీప్లేస్‌‌మెంట్ చేయాల్సింది. ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌తో మ్యాచ్‌‌లో రోహిత్ బరిలోకి దిగాడు. ప్లేఆఫ్స్‌‌లో కూడా అతడు తప్పక ఆడతాడు. తాను ఫిట్‌‌గా ఉన్నట్లు రోహిత్ స్వయంగా చెబుతున్నప్పుడు.. అతడ్ని ఎందుకు ఎంపిక చేయలేదు’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.