
కుమారుడి మానసిక అనారోగ్యమే కారణమని లేఖలో వెల్లడి
నోయిడాలో విషాద సంఘటన
నోయిడా: మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న పదకొండేండ్ల కొడుకుతో కలిసి ఓ తల్లి అపార్ట్మెంట్లోని 13వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. తమ చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ లెటర్ రాసి పెట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నోయిడాలోని ఏస్ సొసైటీలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్పణ్ చావ్లా, సాక్షి చావ్లా దంపతులు.
వీరికి 11 ఏండ్ల కొడుకు ఉన్నాడు. బాబు మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు. దీంతో తరచూ డాక్టర్లకు చూపించేవాళ్లు. గురుద్వారాలకు వెళ్లి ప్రార్థనలు చేసేవాళ్లు. ఎంతమంది డాక్టర్లకు చూపించినా హెల్త్ కండీషన్ ఇంప్రూవ్ కాలేదు. దీంతో సాక్షి చావ్లా తన కొడుకు గురించి పక్కింటి వాళ్లకు చెబుతూ బాధపడుతూ ఉండేది. బతకడం చాలా కష్టంగా మారిందని చెప్పేది. చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న దర్పణ్.. కొడుకుకు మందులు వేయాలని భార్య సాక్షికి చెప్పి బయటికెళ్లాడు.
తర్వాత సాక్షి, తన 11 ఏండ్ల కొడుకుతో బాల్కనీ నుంచి కిందికి దూకింది. ఇద్దరూ స్పాట్లోనే చనిపోయారు. అపార్ట్ మెంట్ వాసులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని డెడ్‌బాడీలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్‌కు పంపించారు. ఇంట్లో సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘మేము ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నందుకు క్షమించండి. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. మా కారణంగా మీరు చాలా ఇబ్బంది పడ్తున్నారు. అందుకే వెళ్లిపోతున్నాం.
మా చావుకు ఎవరూ కారణం కాదు’’ అని భర్త దర్పణ్ చావ్లాను ఉద్దేశిస్తూ సూసైడ్ లెటర్ దొరికింది. కొడుకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో సాక్షి చావ్లా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యేదని, అందుకే ఆత్మహత్య చేసుకున్నదని పోలీసులు తెలిపారు.