ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా,వెలుగు: డాక్టర్లు, సిబ్బంది రౌండ్​ ద క్లాక్​ పనిచేయాలని నిర్మల్​కలెక్టర్​​ముషారఫ్​ అలీ ఫారూఖీ ఆదేశించారు. మంగళవారం ఆయన భైంసా, వానల్​పాడ్ ​గ్రామాల్లో పర్యటించారు. మురికి నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అనంతరం ఏరియా హాస్పిటల్​ను విజిట్​ చేశారు. డెంగీ, మలేరియా బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తే వెంటనే దగ్గర్లోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలన్నారు. జిల్లాలో డోర్​ టు డోర్​ ఫీవర్​ సర్వే చేస్తున్నట్లు తెలిపారు. భైంసా ఏరియా హాస్పిటల్​ అభివృద్ధికి రూ. 85 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. హాస్పిటల్​అప్​గ్రేడ్​ పనులు జరుగుతున్నాయన్నారు. అంతకుముందు స్థానిక ఆశ్రమ స్కూల్​ను విజిట్ చేసి విద్యార్థులతో మాట్లాడారు. కలెక్టర్​వెంట అడిషనల్ కలెక్టర్​ హేమంత్ బోర్కడే, ఆర్డీవో లోకేశ్వర్​రావు, తహసీల్దార్​చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్​ ఎంఏ అలీం, సూపరింటెండెంట్​ డాక్టర్​కాశీనాథ్, డాక్టర్లు సురేందర్, విజయానంద్, అనిల్​జాదవ్​ తదితరులు ఉన్నారు.

 

మావోయిస్టులకు సహకరించొద్దు

ఆసిఫాబాద్/కడెం, వెలుగు:  మావోయిస్టుల సంచారం మొదలైందని, వారికి ఎవరూ సహకరించవద్దని ఆసిఫాబాద్, నిర్మల్​ ఎస్పీలు​ కె. సురేశ్​కుమార్, ప్రవీణ్​కుమార్​ సూచించారు. ఆసిఫాబాద్​ఎస్పీ మంగళవారం మావోయిస్టుల ఫొటోలతో కూడిన పోస్టర్​ను రిలీజ్​ చేశారు. నక్సల్స్​ గురించి తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇస్తే రివార్డు ఇస్తామని పేర్కొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా వాసులు 8332801100 , 8333986921, 8333986924 నంబర్లకు కాల్​చేసి చెప్పొచ్చన్నారు. డయల్​100 కూడా ఫోన్​ చేయొచ్చన్నారు. యువత మావోయిస్టుల వలలోపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్​సూచించారు. కడెం మండలం గండిగోపాల్ పూర్, గండిగూడం, కట్టకింది గూడం,  మిద్దె చింతల్, ఉడుంపూర్ గ్రామాల్లో ఎస్పీ పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో దూసుకెళ్తున్న నిర్మల్ జిల్లాలో విప్లవ రాజకీయాలు, హింసాత్మక సంఘటనలకు తావులేదన్నారు. ఏ సమస్య ఉన్నా.. ప్రభుత్వం, పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లోని చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్స్​అందించారు. కార్యక్రమాల్లో ఆసిఫాబాద్​ అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వ రరావు, డీఎస్పీ శ్రీనివాస్, నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి, ఖానాపూర్ సీఐ అజయ్ బాబు, కడెం ఎస్సై రాజేశ్, సర్పంచులు, పటేళ్లు పాల్గొన్నారు.

రిమ్స్ లో నాణ్యమైన వైద్య సేవలు

ఆదిలాబాద్ టౌన్,వెలుగు: ఆదిలాబాద్ రిమ్స్ లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం ఆమె హాస్పిటల్​లోని పలువార్డులు తనిఖీ చేసి వైద్య సేవలపై ఆరాతీశారు. ఆమె వెంట అడిషనల్​కలెక్టర్​రిజ్వాన్ బాషా షేక్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సూపరింటెండెంట్​అశోక్ తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యే రాజాసింగ్​పై పీడీ యాక్ట్​ ఎత్తివేయాలి​

భైంసా,వెలుగు: ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసీఆర్ సర్కార్​ పెట్టిన పీడీ యాక్ట్​ను వెంటనే ఎత్తివేయాలని హిందూవాహిని పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావుల రాము, చింతపండు మహేశ్ డిమాండ్​ చేశారు. మంగళవారం భైంసా తహసీల్దార్​చంద్రశేఖర్​ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. టీఆర్ఎస్​ సర్కారు ఒక వర్గానికి కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ఎంఐఎంకు చెందిన అక్బరుద్దీన్​పై అనేక కేసులు ఉన్నాయని.. ఆయనపై పీడీ యాక్ట్​ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. కార్యక్రమంలో లీడర్లు ఆకుల రంజిత్, బాజనోళ్ల వినాయక్ తదితరులు పాల్గొన్నారు.

రామకృష్ణది ముమ్మాటికి హత్యే 

  • ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడనడం సరికాదు
  • నిందితులపై మర్డర్​ కేసు పెట్టాలి
  • పౌరహక్కుల సంఘం డిమాండ్​

బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి మండలం పెద్దదుబ్బ గ్రామానికి చెందిన పందుల రామకృష్ణది ముమ్మాటికి హత్యేనని పౌరహక్కుల సంఘం లీడర్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్​22న పెద్దదుబ్బ గ్రామానికి చెందిన పందుల రామకృష్ణ చనిపోయిన స్పాట్​ను మంగళవారం పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణ రావు, సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ ఎ. సారయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్, ఉపాధ్యక్షురాలు పుల్ల సుచరిత పరిశీలించారు. మృతుడు రామకృష్ణ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు.  గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బండారి వంశీకృష్ణ, ట్రాక్టర్ యజమాని ముక్కెర రామకృష్ణ పత్తి చేను వద్దకు పిలిచి రామకృష్ణను ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపారన్నారు. విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన తాళ్లగురిజాల ఎస్సై రాజశేఖర్​నిందితులతో కుమ్మక్కై కేసును పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఎంపీటీసీ పొట్లపల్లి సుభాష్ రావు, బుచ్చయ్యపల్లి సర్పంచ్ భర్త పొలవేని శ్రీనివాస్ పోలీసులకు లక్షల రూపాయలు ముట్టజెప్పారన్నారు. వార్డు సభ్యురాలు భర్త ముత్యాల భీమరాజు, గ్రామస్తులు పిట్టల శ్రీనివాస్, రాయిల్ల రాయమల్లు, సబ్బం చంద్రయ్యలు కలిసి హత్యకు స్కెచ్​వేశారన్నారు. కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం లీడర్లు నార వినోద్, బి.రవి, యాదనవేని పర్వతాలు తదితరులు ఉన్నారు.

దృష్టి మళ్లించేందుకే ఆరోపణలు 

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలోని సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం కేసీఆర్​ పెద్దపల్లి బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీపై, బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​పై ఆరోపణలు చేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు విమర్శించారు. మంగళవారం జిల్లా ఆఫీసులో ప్రెస్​మీట్​ ఏర్పాటు చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్​ గత ఎన్నికల సందర్భంగా జిల్లా ప్రజలకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుందని తప్పుడు ప్రచారం చేసి కార్మికులను భయాందోళనకు గురిచేయడం తగదన్నారు. సింగరేణి ఆదాయాన్ని ఇతర జిల్లాకు తరలించుకుపోతుంటే ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. గోదావరిపై మంచిర్యాల– అంతర్గాం బ్రిడ్జిని నిర్మించాలని, కాళేశ్వరం బ్యాక్ వాటర్​ ముంపు బాధితులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్​ చేశారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, నాయకులు పొనుగోటి రంగారావు, వంగపల్లి వెంకటేశ్వర్​రావు, తుల ఆంజనేయులు, జోగుల శ్రీదేవి, గాజుల ప్రభాకర్, రాచకొండ సత్యనారాయణ పాల్గొన్నారు.  

150 కుటుంబాలకు సరుకులు అందజేత 

మంచిర్యాల, వెలుగు: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చున్నంబట్టివాడలోని 150 వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను మంగళవారం లయన్స్​ భవన్​లో అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.5వేల విలువైన సరుకులను జిల్లా గవర్నర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. రీజియన్ చైర్​పర్సన్ చంద్రమోహన్​గౌడ్, ఉప గవర్నర్లు రాజిరెడ్డి, వెంకటేశ్వర్​రావు, కేబినెట్​ సెక్రటరీ నారాయణరావు, వి.మధుసూదన్​రెడ్డి పాల్గొన్నారు.  

మట్టి వినాయకుల పంపిణీ
 
మంచిర్యాల, వెలుగు: వినాయక చవితి సందర్భంగా కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నిర్వాహకులు కస్తూరి పద్మచరణ్ మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బంకమట్టితో తయారు చేసిన 1500 ప్రతిమలను కోల్​కతా నుంచి తెప్పించామన్నారు. ప్రతిమలు కావాల్సిన వారు రెడ్డికాలనీలోని కృష్ణవేణి టాలెంట్​ స్కూల్​లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ కోర్ రాష్ట్ర శిక్షకుడు, గుండేటి యోగేశ్వర్, డీఈవో ఆఫీస్​ సూపరింటెండెంట్లు సత్యనారాయణ, నవీన్ పాల్గొన్నారు.  

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

నిర్మల్,వెలుగు: వీఆర్ఏల సమస్య వెంటనే పరిష్కరించాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్​చేశారు. సారంగాపూర్ మండల కేంద్రంలో వీఆర్ఏలు చేపట్టిన  ధర్నా శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మెచేస్తున్న వీఆర్ఏలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సీఎం కుటుంబం ఆస్తులు కాపాడుకునేందుకే ధరణి పోర్టల్ ను తెరపైకి తెచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లన్నిటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రమణారెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

గడ్డిమైదానాలు భేష్​

నిర్మల్,వెలుగు: జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్ లో చేపట్టిన గడ్డి మైదానాలు బాగున్నాయని జాతీయ పులుల సంరక్షణ సంస్థ పేర్కొంది. పులుల సంరక్షణ, వన్యప్రాణులకు ఆహారం అందించేందుకు ఈ మైదానాలు ఉపయోగపడనున్నాయి. కవ్వాల్​ అభయారణ్యంలో గ్రాస్ ప్లాట్ల గుర్తింపు, విత్తనాల సేకరణ, మైదానాల అభివృద్ధి తదితర చర్యలు కొనసాగుతున్నాయి. దీని కారణంగా కవ్వాల్ అభయారణ్యంలో శాఖహార జంతువుల సంఖ్య పెరుగుతోందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కవ్వాల్ టైగర్ జోన్  ప్రాధాన్యం, ఎకో టూరిజం వెబ్​సైట్​ను ఆవిష్కరించారు.ఈ వెబ్​సైట్​ద్వారా కవ్వాల్ టైగర్ జోన్ విశేషాలు తెలుసుకోవచ్చన్నారు.