బ్రహ్మపురం అగ్నిప్రమాదం: ఇంటింటికి సర్వే

బ్రహ్మపురం అగ్నిప్రమాదం:  ఇంటింటికి సర్వే

కేరళలోని కొచ్చిలో జనాలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీనికి కారణం మార్చి 2న ఓ భారీ డంప్ యార్డ్ లో జరిగిన అగ్ని ప్రమాదం. బ్రహ్మపురం డంప్‌యార్డులో గత వారం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తున్న మంటలు ఇంకా తగ్గలేదు. మంటలను ఆదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తునే ఉన్నారు. 110 ఎకరాల్లో విస్తరించిన ఆ డంప్ యార్డ్ లో అగ్ని ప్రమాదం జరగగంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. చెత్త, అందులోని ప్లాస్టిక్ కాలి విషపూరిత పొగలు రావడంతో చుట్టూ కొన్ని కిలో మీటర్ల పరిధిలోని జనాలు వాటిని పీల్చి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు బ్రహ్మపురంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

విషపూరిత పొగ ప్రభావంపై అంచనా వేసేందుకు ఇక్కడ ఆరోగ్య సర్వే జరగనుంది. పొగ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురుకుంటున్న వారిని గుర్తించడానికి హెల్త్‌కేర్ అధికారులు ఇంటింటికి సర్వే నిర్వహించనున్నారు. గుర్తించిన బాధితులకు వెంటనే  వైద్యసేవలు అందించనున్నారు. మార్చి 10న ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో ఇంటింటికి సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో తగిన సౌకర్యాలు ఉండేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఊపిరితిత్తులు, గుండెజబ్బులు ఉన్నవారు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఇంటి లోపలే ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది.  బయటకు వచ్చేవారు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని తెలిపింది.