మంత్రి సత్యవతిపై ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆగ్రహం

మంత్రి సత్యవతిపై ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆగ్రహం

మహబూబ్ బాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పై డోర్నకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మండిపడ్డారు. శిశు, మహిళా సంక్షేమానికి సంబంధించిన  విషయాలు తమకు తెలియడం లేదంటూ మంత్రి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లా అధికారుల తప్పిదమో..? మంత్రి తప్పిదమో..? తెలియని పరిస్థితి ఉందన్నారు. మంత్రి సత్యవతి ఎమ్మెల్యేలను దూరం పెడుతున్నారని వాపోయారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఫిర్యాదు  చేయాలని మాత్రం కాదన్నారు. 

గతంలో ఏ శాఖ నుంచి ఏ పథకం వచ్చినా స్థానిక ఎమ్మెల్యేను అడిగి అందించేవారని చెప్పారు. ప్రభుత్వ పథకాల గురించి చాలామంది లబ్ధిదారులు తమ దగ్గరకు వస్తుంటారని, అప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైనా పద్ధతి కాదని, కనీసం మీరు ఇచ్చే పథకాలైనా చెప్పుకోవాలి కదా..? అంటూ కామెంట్స్ చేశారు. మరిపెడ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వికలాంగులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 

రెడ్యా, సత్యవతి మధ్య  కోల్డ్​వార్​ 
డోర్నకల్ నియోజకవర్గం రాజకీయాల్లో మంత్రి సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్ మధ్య అధిపత్య పోరు కొనసాగుతోంది. ఇద్దరి మధ్య వర్గ విభేదాలు ఎప్పటి నుంచో  ఉన్నాయి. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సత్యవతి రాథోడ్ 5 వేలకు పైగా ఓట్ల తేడాతో రెడ్యానాయక్ పై విజయం సాధించారు. అయితే.. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె డోర్నకల్ రాజకీయ తెరపై తన ప్రతిభను చాటుకోలేకపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిన సత్యవతి.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రెడ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రెడ్యా నాయక్ తన కూతురు, ఎంపీ కవితతో కలిసి టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇద్దరు రాజకీయ ఆజాత శత్రువులు ఒకే పార్టీలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సిట్టింగులకే సీట్లు ప్రాతిపదికన 2018లో అసెంబ్లీ టికెట్లు ఖరారు కావడంతో రెడ్యా నాయక్ కే టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. సత్యవతి రాథోడ్ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని అంతా అనుకుంటున్న సమయంలో గులాబీ బాస్ కొన్నాళ్లకే ఆమెకు ఎమ్మెల్సీ టికెట్  ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. అయితే.. అప్పటికే మంత్రి పదవి ఆశించిన రెడ్యానాయక్ కు నిరాశే ఎదురైంది.