
- ముగిసిన ప్రవేశాల ప్రక్రియ
- నిరుటి కన్నా 8,664 అడ్మిషన్లు ఎక్కువ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటివరకూ మొత్తం 2,05,106 మంది చేరారు. నిరుటితో పోలిస్తే అడ్మిషన్లు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 967 డిగ్రీ కాలేజీల్లో 4,40,107 సీట్లు ఉండగా, 2,05,106 సీట్లు నిండాయి. మరో 2,35,001 సీట్లు మిగిలాయి. దోస్త్ పరిధిలోని 830 కాలేజీల్లో 3,77,907 సీట్లుంటే 1,76,143 సీట్లు నిండాయి. దీంట్లో సర్కారు డిగ్రీ కాలేజీల్లో భారీగానే సీట్లు నిండాయి.
అయితే 635 ప్రైవేటు కాలేజీల్లో 2,62,770 సీట్లుంటే.. 1,00,472 సీట్లు మాత్రమే ఫిలప్ అయ్యాయి. ఏకంగా 1.62 లక్షల సీట్లు ప్రైవేటు కాలేజీల్లో మిగిలాయి. మరోపక్క 79 డిగ్రీ కాలేజీల్లో 23,614 సీట్లు ఉండగా 11,257 సీట్లు మాత్రమే నిండాయి. 58 నాన్ దోస్త్ కాలేజీల్లో 36,866 సీట్లు ఉండగా.. వాటిలో 16,182 సీట్లు నిండాయి. మరో 20వేల సీట్లు మిగిలాయి. ఓవరాల్గా గతేడాది 1.96 లక్షల అడ్మిషన్లు మాత్రమే జరగగా.. ఈసారి 8,664 అడ్మిషన్లు పెరిగాయి.
స్పాట్ లో 8,655 మంది చేరిక
ఇటీవల సర్కారు, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో స్పాట్ ప్రక్రియ ద్వారా 8,655 మంది అడ్మిషన్లు పొందారు. దీంట్లో తొలిసారిగా సర్కారు డిగ్రీ కాలేజీలు, వర్సిటీ కాలేజీల్లో అవకాశం ఇవ్వగా, వాటిలో 3,037 మంది చేరారు. ప్రైవేటు కాలేజీల్లో 5,618 అడ్మిషన్లు తీసుకున్నారు.