టెల్కోలను ఏమీ అనొద్దు.. వచ్చే వారం దాకా ఆగుదాం

టెల్కోలను ఏమీ అనొద్దు.. వచ్చే వారం దాకా ఆగుదాం

ఆఫీసర్లకు టెలికంశాఖ ఆదేశం

న్యూఢిల్లీ: ఏజీఆర్‌‌ బకాయిలు చెల్లించని టెలికం కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవద్దని డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ టెలికాం (డాట్‌‌) తన ఆఫీసర్లను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఈ విషయంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వేచిచూడాలని డాట్‌‌ లైసెన్సింగ్‌‌ ఫైనాన్స్‌‌ పాలసీ వింగ్ సూచించింది. డాట్‌‌ డిపార్ట్‌‌మెంట్స్‌‌కు హెడ్‌‌గా పనిచేసే మెంబర్‌‌ ఫైనాన్స్‌‌ సూచన మేరకు ఈ ఆదేశాలు జారీ చేసింది. భారతీ ఎయిర్‌‌టెల్‌‌, వొడాఫోన్‌‌ ఐడియా ఏజీఆర్‌‌ బకాయిలుగా రూ.88,624 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఇందుకు మూడు నెలల గడువు ఇచ్చింది. గురువారంతో తుది గడువు ముగిసింది. ఇంత తక్కువ సమయంలో బకాయిలు చెల్లించడం సాధ్యం కాదంటూ టెల్కోలు సుప్రీంకోర్టులో పిటిషన్‌‌ వేయగా, దీనిపై వచ్చే వారం విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేదాకా ఏజీఆర్‌‌ బకాయిలు కట్టలేమని ఈ రెండు కంపెనీలూ డాట్‌‌కు స్పష్టం చేశాయి.   ఎయిర్‌‌టెల్‌‌, వొడాఫోన్‌‌ ఐడియా, టాటా టెలిసర్వీసెస్‌‌ రూ.1.02 లక్షల కోట్లు డాట్‌‌కు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పడం తెలిసిందే. ఈ తీర్పును సమీక్షించాలంటూ టెల్కోలు వేసిన రివ్యూ పిటిషన్‌‌ను న్యాయస్థానం గత వారం కొట్టేసింది.

రూ.195 కోట్లు చెల్లించిన జియో

భారతీ ఎయిర్‌‌టెల్‌‌, వొడాఫోన్‌‌ ఐడియాలు బకాయిలు చెల్లించకున్నా, జియో మాత్రం రూ.195 కోట్లు డాట్‌‌కు గురువారమే చెల్లించింది. టెలికం కంపెనీలన్నీ కలిపి రూ.1.40 లక్షల కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా, జియో ఒక్కటే బకాయిలు కట్టింది. ఏజీఆర్‌‌ బకాయిలను వసూలు చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ టెలికాం (డాట్‌‌)కు గత అక్టోబరులో అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఇప్పటి తమకు రూ.వేలాది కోట్ల రూపాయల అప్పు  ఉన్నందున, వీటిని చెల్లించలేమని, తమను ఆదుకోవాలని టెల్కోలు ప్రభుత్వాన్ని కోరాయి.