ఏడేండ్లయినా ముందుకుపడని డబుల్​ బెడ్రూం ఇండ్ల స్కీం

ఏడేండ్లయినా ముందుకుపడని డబుల్​ బెడ్రూం ఇండ్ల స్కీం
  • కడ్తామని చెప్పింది 2,91,057
  • ఇప్పటివరకు కట్టినవి 1,14,002
  • ఇచ్చినవి 20,709
  • అసెంబ్లీ ఎన్నికల దాకా ఊరిచ్చుడే!

హైదరాబాద్, వెలుగు: ఏడేండ్ల కింద సీఎం కేసీఆర్​ ప్రకటించిన డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీమ్​ ముందుకు సాగుతలేదు. చెప్పినన్ని ఇండ్లు కట్టకపోగా.. కట్టిన ఇండ్లను కూడా పంపిణీ చేయడం లేదు. ఎప్పుడో బుద్ధిపుట్టినప్పుడు అక్కడక్కడ కొందరికి ఇచ్చి సర్కారు చేతులు దులుపుకుంటున్నది. కట్టిన ఇండ్లను రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పుడే ఇచ్చేస్తే.. ఎన్నికల టైమ్​ వరకు జనం మరిచిపోతారన్న ఉద్దేశంతోనే ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తున్నది. డబుల్ బెడ్రూం ఇల్లు వస్తుందన్న ఆశతో తమ గుడిసెలను వదిలిపెట్టి.. ప్రభుత్వానికి జాగా ఇస్తే.. ఏండ్లు గడుస్తున్నా ఫాయిదా ఉండటం లేదని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిరాయి ఇండ్లలోనే గడపాల్సి వస్తున్నదని, కూలీనాలి చేసుకొని బతికే తమకు కిరాయిలు ఎల్తలేవని వాపోతున్నారు. 

ఇదీ లెక్క..!
2015 అక్టోబర్​లో డబుల్​ బెడ్రూం ఇండ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2,91,057 ఇండ్లు కట్టిస్తామని ప్రకటించింది.  ఇందులో లక్ష ఇండ్లు గ్రేటర్​ హైదరాబాద్ (జీహెచ్​ఎంసీ) పరిధిలోనివి. మిగతా 1,91,057 ఇండ్లు జిల్లాల్లో కట్టిస్తామని తెలిపింది. లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్​ బెడ్రూం ఇండ్లు కేవలం 20,709. మొత్తంగా పూర్తిస్థాయిలో కట్టిన ఇండ్లు  1,14,002. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నవి 1,16,081. ఏండ్లకేండ్లు ఎదురుచూసి ఓపిక నశించి కొన్ని చోట్ల జనం.. డబుల్​ బెడ్రూం ఇండ్లలోకి వెళ్తున్నారు. కట్టిన ఇండ్లు కూడా ఇవ్వడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారని అధికారులను నిలదీస్తున్నారు. ఇండ్లలోకి వెళ్తున్న అర్హులను... పోలీసుల సాయంతో అధికారులు బలవంతంగా బయటకు పంపించేసిన ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. 

జీహెచ్​ఎంసీలో 6 లక్షలకుపైగా అప్లికేషన్లు
ఇండ్లు పూర్తయిన చోట లబ్ధిదారుల ఎంపికను అధికారులు చేపట్టడం లేదు. దీనిపై అధికారులను సంప్రదిస్తే.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటం లేదని చెప్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా  డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం లక్షల్లో అప్లికేషన్లు వచ్చాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్​లోనే 6 లక్షలకు పైగా  అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. 2014 లో సమగ్ర కుటుంబ సర్వే చేసినపుడు రాష్ట్రంలో సొంతిల్లు లేనివాళ్లు 26.31 లక్షల మంది  ఉన్నట్లు తేలింది. ఇప్పుడు ఆసంఖ్య మరింత పెరిగింది. 

రూ. 3 లక్షల ఆర్థిక సాయం స్కీమ్​తో లింక్?
రాష్ట్రంలో సొంత జాగా ఉన్న వారికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం, ఎస్సీ, ఎస్టీలకు రూ. 6 లక్షలు చేస్తామని టీఆర్ ఎస్ పార్టీ 2018 ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించింది. అయితే.. మొన్న రాష్ట్ర బడ్జెట్  లో మాత్రం దాన్ని రూ. 3 లక్షలకు మార్చింది. ఇందుకోసం రూ.12  వేల కోట్లు కేటాయించింది. కానీ, అమలు చేయడం లేదు. ఈ స్కీమ్ తో  డబుల్  బెడ్రూం ఇండ్ల స్కీమ్ లింక్​ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందే  ప్రారంభించాలని సర్కారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. 

జీహెచ్​ఎంసీలో ఇచ్చింది  3,313 ఇండ్లే 
జీహెచ్ ఎంసీ పరిధిలో లక్ష డబుల్​ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 56,066 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా..  3,313 ఇండ్లు మాత్రమే పంపిణీ చేసింది. పటాన్ చెరు సమీపంలోని కొల్లూరు దగ్గర  రూ. 1,408 కోట్లతో  120 ఎకరాల్లో 117 బ్లాక్ లలో 15,660 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసినప్పటికీ ఒక్కరికి కూడా ఇయ్యలేదు. జీహెచ్​ఎంసీ మినహా జిల్లాల్లో 1,91,057 ఇండ్లు కట్టిస్తామని చెప్పి..57,936 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసింది. ఇందులో 17,396 మాత్రమే పంపిణీ చేసింది. 

10 జిల్లాల్లో ఒక్కరికి కూడా పంపిణీ చేయలే
అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు 10 జిల్లాల్లో ఒక్కరికి కూడా డబుల్​ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం పంపిణీ చేయలేదు.  గద్వాలలో 715 ,  నాగర్ కర్నూల్​లో 777,  ఆదిలాబాద్ లో 1,546,  ఆసిఫాబాద్​లో 567,  పెద్దపల్లి లో 2,535 ,  భూపాలపల్లిలో 1,975,  భువనగిరిలో 1,122,  వికారాబాద్​లో  2,169,  మేడ్చల్ లో 285, నారాయణపేటలో 900 ఇండ్లు పూర్తి కాగా.. ఒక్కరికి కూడా  కూడా ఇయ్యలేదు. కాగా, సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 4,400 ఇండ్లు పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో 3,206, కొత్తగూడెం జిల్లాలో 1,445, సంగారెడ్డి  జిల్లాలో 1,261,  సిరిసిల్ల జిల్లాలో 539 ఇండ్లు పంపిణీచేశారు.

రెండేండ్ల నుంచి పనులు జరగట్లే


2017 లో  మా ఏరియాలో 1,824 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం స్టార్ట్  చేసిన్రు. 3 కాలనీల్లోని 500 గుడిసెలను, వాటిలో ఉంటున్న పబ్లిక్​ను ఖాళీ చేపిచ్చిన్రు. దీంతో కిరాయి ఇండ్లలో ఉండాల్సి వస్తున్నది. ఇంత వరకు 50% పనులు కూడా పూర్తి కాలేదు. వెంటనే నిర్మాణం పూర్తి చేసి పంచాలె. ‑ దీపక్, బోజగుట్ట, నాంపల్లి నియోజకవర్గం, హైదరాబాద్

నెల కిందనే పనులు స్టార్ట్​ చేసిన్రు
2015 లో  ఇండ్ల నిర్మాణం స్టార్ట్ చేస్తమని చెప్పి.. నెల కింద పనులు స్టార్ట్ చేసిన్రు. ఇప్పుడే పిల్లర్ల కోసం ఇనుప తీగ చుడుతున్నరు. అధికారులను అడిగితే కరోనా వల్ల కూలీలు దొరకక ఆలస్యమైందంటున్నరు. ఇప్పుడు  పునాదులు అయినయి. పిల్లర్ల వర్క్ స్టార్ట్ చేస్తే ఎప్పుడు ఇండ్లు పూర్తయితయ్​? - అశోక్, అంబేద్కర్​నగర్​, ఖైరతాబాద్ నియోజకవర్గం, హైదరాబాద్