
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారును తీసుకువస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన జనం గోస-బీజేపీ భరోసా బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. దుబ్బాక, హుజూరాబాద్లో తగిలిన ఎదురుదెబ్బలు టీఆర్ఎస్కు గుణపాఠాలని నడ్డా అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ సమితి అన్న ఆయన.. దేశంలో అత్యంత అవినీతి సర్కారు కేసీఆర్ దేనని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని ఆయన ఆరోపించారు. మిషన్ భగీరథలో కూడా భారీ అవినీతి జరిగిందని నడ్డా విమర్శించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే రాష్ట్ర అభివృద్ధి రెట్టింపు అవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి వాటినే తెలంగాణలో అమలు చేస్తున్నారని నడ్డా మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఆయుష్మాన్ భారత్ అమలుకాకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నాడని, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పథకాన్నిఅమలుచేస్తామని నడ్డా హామీ ఇచ్చారు.
దేశాన్ని పేదరికం నుంచి దూరం చేసేందుకు మోడీ సర్కారు కృషి చేస్తోందని నడ్డా అన్నారు. 100కుపైగా దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత మోడీదేనన్న ఆయన.. 190 కోట్ల వ్యాక్సిన్లు అందించి దేశ ప్రజల ప్రాణాలకు ప్రధాని కవచంగా నిలిచారని చెప్పారు.