టెట్​లో డబుల్ పాస్... రెండింతలు పెరిగిన పాస్ పర్సంటేజీ

టెట్​లో డబుల్ పాస్... రెండింతలు పెరిగిన పాస్ పర్సంటేజీ
  •  పేపర్ 1లో 67.13% .. పేపర్ 2లో 34.18%  క్వాలిఫై
  • ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ 
  • ప్రస్తుత టెట్ క్వాలిఫై అయినవాళ్లకు ఒకసారి డీఎస్సీకి నో ఫీజు 
  • క్వాలిఫై కానోళ్లకు వచ్చేసారి ఫ్రీగా టెట్​కు అప్లై చేసుకునే చాన్స్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్–2024) ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్ 1లో 67.13% మంది క్వాలిఫై కాగా, పేపర్ 2లో 34.18% మంది అర్హత  సాధించారు. నిరుటితో పోలిస్తే టెట్ పాస్ పర్సంటేజీ డబుల్ అయింది. బుధవారం తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి టీజీ టెట్-–2024 ఫలితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. 

పది రోజుల్లోనే ఫలితాలు

మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు ఆన్​లైన్ లో జరిగాయి. 2,86,381 మంది దరఖాస్తు చేసుకోగా... 2,36,487 మంది అటెండ్ అయ్యారు. కేవలం పది రోజుల్లో రిజల్ట్ రిలీజ్ చేశారు.  పేపర్ 1లో 99,961 మంది దరఖాస్తు చేసుకోగా.. 85,996 మంది పరీక్ష రాశారు. దీంట్లో 57,725 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 లో 1,86,420 మంది అప్లై చేసుకున్నారు. దీంట్లో 1,50,491 మంది ఎగ్జామ్ కు అటెండ్ కాగా, వారిలో 51,443 మంది అర్హత సాధించారు. 

టీచర్లలో సగం మంది క్వాలిఫై

ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అన్న ఎన్​సీటీఈ నిబంధనతో ఈ ఏడాది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాశారు. అయితే.. 48,582 మంది టీచర్లు దరఖాస్తు చేసుకోగా, 33,218 మంది పరీక్ష రాశారు. వీరిలో 18,067 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. పేపర్ 1లో 6,449 మందికి 5,113 మంది.. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ లో 15,302 మందికి 7,826 మంది.. సోషల్ స్టడీస్​లో 11,468 మందికి 5,128 మంది టీచర్లు అర్హత సాధించారు. 

నార్మలైజేషన్ చేయలే..!

తొలిసారిగా ఆన్​లైన్​లో టెట్ నిర్వహించారు. దీంతో పేపర్ 1, పేపర్ 2ను ఇరవై సెషన్లలో కండక్ట్​ చేశారు. దీంతో కొన్ని షిప్టుల వారికి క్వశ్చన్ పేపర్ ఈజీగా, మరికొన్ని షిఫ్ట్ ల వారికి కఠినంగా వచ్చిందని అభ్యర్థులు చెప్తున్నారు. దీంతో నార్మలైజేషన్ ద్వారా మార్కులు ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ, అధికారులు అలా చేయలేదు. డీఎస్సీ, గురుకుల పోస్టుల ఎంపికలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంది. 

దీంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే, టీచర్ పోస్టులు జిల్లాస్థాయివేననీ, ఒక జిల్లాకు ఒకే రోజు పరీక్ష నిర్వహించినట్టు అధికారులు చెప్తున్నారు. దీంతో నార్మలైజేషన్ అవసరం లేదని వారు అంటున్నారు. కానీ, ఇతర జిల్లాల్లో ఉండి రాసిన వారి పరిస్థితిపై క్లారిటీ లేదు. మరోవైపు గురుకుల పోస్టులన్నీ జోన్, మల్టీజోన్ లో ఉంటాయి. వాళ్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభ్యర్థులు చెప్తున్నారు. 

అభ్యర్థులకు గుడ్ న్యూస్..

టెట్ ను తొలిసారిగా ఆన్​ లైన్ లో నిర్వహించారు. దీంతో పరీక్ష ఫీజును అధికారులు భారీగా పెంచారు.ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపుపై ప్రభుత్వం అభ్యర్థించినా ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. టెట్-2024లో క్వాలిఫై కాని అభ్యర్థులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో పాటు టెట్-2024లో క్వాలిఫై సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ అప్లై చేసుకునే చాన్స్ ఇచ్చింది. 

డీఎస్సీ దరఖాస్తుకు గడుపు పెంపు

11,062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి మార్చి 4 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, టెట్ నోటిఫికేషన్ వేయడంతో దరఖాస్తు గడువును విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 19 వరకూ ఫీజు చెల్లించొచ్చు. ఫీజు చెల్లించిన అభ్యర్థులు 20 వరకూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే దరఖాస్తు చేసుకునేందుకు ఓ ఫార్మాట్ ఉండటంతో సర్కారు ప్రకటించిన ఉచిత దరఖాస్తు అవకాశం వచ్చే డీఎస్సీకి అమలు చేయనున్నారు.

రిజల్ట్ డబుల్...

నిరుటితో పోలిస్తే టెట్ పాస్ పర్సంటేజీ డబుల్ అయింది. 2023లో జరిగిన టెట్ పేపర్ 1లో 36.89% మంది మాత్రమే క్వాలిఫై కాగా.. ఈ ఏడాది మాత్రం 67.13శాతానికి పెరిగింది. పేపర్​ 2లో నిరుడు కేవలం 15.30% మంది టెట్ లో అర్హత సాధించగా.. ఈసారి ఏకంగా 34.18% మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 2లోని సోషల్ స్టడీస్​లో పాస్ పర్సంటేజీ మూడింతలు పెరగ్గా.. మ్యాథ్స్ అండ్ సైన్స్ లో రెండింతలు అయింది. నిరుడు పేపర్ 2 సోషల్ స్టడీస్​ లో 11.47% మంది అర్హత సాధించగా..ఈ ఏడాది 30.61 శాతం మంది క్వాలిఫై అయ్యారు. మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్​ లో నిరుడు 18.66% మంది పాస్ కాగా.. ప్రస్తుతం 37.4% మంది అర్హత సాధించారు.