- నదీ జలాలపై అసెంబ్లీలో ఏమని ప్రెజెంటేషన్ ఇస్తరు: కేటీఆర్
- బీఆర్ఎస్ పార్టీ డైరీ, క్యాలెండర్ రిలీజ్ సభలో కామెంట్లు
హైదరాబాద్, వెలుగు: నదీ జలాలపై సాగునీటి అంశాలపై కనీస అవగాహన కూడా లేని సీఎం అసెంబ్లీలో తమకు ఉపన్యాసాలు ఇస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉందో కూడా తెలియని సీఎం.. గోదావరి కృష్ణా జలాలపై చర్చ చేస్తారా అని ప్రశ్నించారు. గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఆయన మీడియాతో మాట్లాడారు.
కృష్ణా జలాల అంశంలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే.. తమకూ ఆ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘‘మేము అడిగింది చాలా సింపుల్ ‘మీ వెర్షన్ మీరు చెప్పండి.. మా వెర్షన్ మేం చెబుతాం. మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇస్తే.. గత పదేండ్లలో వ్యవసాయాన్ని, సాగు నీటి రంగాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లామో సభలో వివరిస్తాం” అని తెలిపారు.
మేడిగడ్డ ఎట్ల పేల్చేసిన్రో ప్రెజెంటేషన్ ఇస్తరా
ప్రభుత్వం ఏమని ప్రెజెంటేషన్ ఇస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘మీ దగ్గర్నుంచి మేం ఏం నేర్చుకోవాలి? మేడిగడ్డ ఎలా పేల్చారో చెబుతారా లేదా చెక్ డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేర్పిస్తారా? సుంకిశాల ఎలా కూల్చారో వివరిస్తారా లేదంటే వట్టెం పంప్‌హౌస్ ఎలా ముంచారో చెప్తారా? కృష్ణా నదిలో తెలంగాణకు ఉన్న హక్కులను కృష్ణా బోర్డుకు ఎలా ధారాదత్తం చేశారో వివరిస్తారా? ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోతే.. ఆ ఘటనలో మరణించిన కార్మికుల మృతదేహాలను ఇప్పటికీ బయటకు తీసుకురాలేకపోయిన అసమర్థ చేతగాని ప్రభుత్వం ఇది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటివరకూ సరైన సమాధానం చెప్పలేదు.
సంస్థను బ్లాక్‌లిస్ట్ చేయాలని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు సిఫార్సు చేసినా సంస్థపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు’’ అని ఆయన మండిపడ్డారు. ఏటేటా క్యాలెండర్లు మారుతున్నాయే తప్ప.. కాంగ్రెస్‌కు ఓట్లేసిన ప్రజల జీవితాలు ఏ మాత్రం మారడం లేదని కేటీఆర్ విమర్శించారు. రెండేండ్ల నుంచి దుష్పరిపాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ముందుకు సాగుతున్నారన్నారు.
