రిజర్వాయర్ కట్ట నిర్మాణం క్వాలిటీపై అనుమానాలు

రిజర్వాయర్ కట్ట నిర్మాణం క్వాలిటీపై అనుమానాలు

ఒకేసారి కాకుండా ఎక్కడికక్కడ ముక్కల్లా కట్ట నిర్మాణం

ప్యాచ్​వర్క్ లతో భవిష్యత్​లో తెగే ప్రమాదం

క్వాలిటీలేని పనులపై రిటైర్డ్​ ఇంజినీర్ల విమర్శలు

పట్టించుకోని ఉన్నతాధికారులు

నాగర్​కర్నూల్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్​ స్కీంలో భాగంగా  రూ.3,701 కోట్లతో నాగర్​కర్నూల్​ జిల్లా వట్టెం వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్​ కట్ట పనుల్లో క్వాలిటీపై అనుమానాలు తలెత్తుతున్నాయి.16 టీఎంసీలు స్టోర్​ చేసేలా డిజైన్​ చేసిన ఈ రిజర్వాయర్​ కట్టను  ఒకేసారి కాకుండా ఎక్కడికక్కడ ముక్కల్లా నిర్మిస్తున్నారు. 4.7 కిమీల పొడవైన కట్టను ఐదు చోట్ల మధ్యలో వదిలేశారు. వీటిని ప్యాచ్​వర్క్ ల ద్వారా కలిపితే భవిష్యత్​లో తెగే ప్రమాదం ఉందని రిటైర్డ్​ ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. కట్ట కోసం నల్లమట్టి, ఎర్రమట్టి మాత్రమే వాడాల్సి ఉండగా, మొరం, చవట మన్ను మిక్స్ చేసి వాడుతున్నారు. కొన్నిచోట్ల స్థానికంగా దొరికే గుండ్లు పోసి పనికానిచ్చేస్తున్నారు. ఎర్రమట్టి కోసం సమీపంలోని గుట్టలను, నల్లమట్టి కోసం చుట్టుపక్కల 20 చెరువులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నా ఆఫీసర్లెవరూ పట్టించుకోవడం లేదు. ఇటీవలి వర్షాలకు కట్ట కూలుతున్నా, రివిట్​మెంట్​ తేలుతున్నా ఏ ఇంజినీర్​కూడా ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు.

ఇష్టారాజ్యంగా మట్టి కట్ట పనులు

14.7 కి.మీ.ల పొడవు,16 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల వట్టెం రిజర్వాయర్​ పనులను 2015లో ప్రారంభించారు. ఈ రిజర్వాయర్​ నిర్మాణానికి దాదాపు 3,700 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో 900 ఎకరాల అసైన్డ్, గైరాన్​ భూములు ఉన్నాయి. అనేఖాన్ పల్లి గ్రామంతో పాటు అనేఖాన్​పల్లి తండా, కారుకొండ తండా, లక్ష్మి తండా, రాంరెడ్డిపల్లి తండా పూర్తిగా రిజర్వాయర్​లో ముంపునకు గురికానున్నాయి. కట్ట నిర్మాణ పనులను మూడు ప్యాకేజీల కింద విభజించారు. కాంట్రాక్ట్​ దక్కించుకున్న సంస్థ పనులు మొదలుపెట్టలేదని మూడేళ్ల తర్వాత మళ్లీ వేరే కంపెనీకి పనులు అప్పగించారు. 14.7 కి.మీ.ల పొడవైన మట్టికట్టను 60 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సి ఉంది. దీని కోసం దాదాపు 3 కోట్ల పైచిలుకు క్యూబిక్​ మీటర్ల నల్ల, ఎర్రమట్టి అవసరమని అంచనా వేశారు.  కట్ట కింద 400 మీటర్ల బాటమ్​విడ్త్​లో కటాఫ్​ట్రెంచ్​తీసి సిమెంట్​గ్రౌటింగ్, ప్రెషర్​గ్రౌటింగ్​చేయాలి. అనంతరం నల్లమట్టి, ఎర్రమట్టి వేసి వాటరింగ్, రోలింగ్​తో గ్రౌట్​కట్ట ఎత్తు పెంచే పనులు చేపట్టాలి. కట్టకు మట్టి కోసం గుత్తేదార్లు నల్లరేగడి, దుబ్బ పొలాల కొనుగోలు కోసం ప్రభుత్వం ఎకరాకు రూ. 6 లక్షలు చెల్లిస్తుంది. మట్టిని తరలించేందుకు క్యూబిక్​ మీటర్​కు రూ.550 నుంచి రూ.600 వరకు చెల్లిస్తుంది. వట్టెం కట్ట మట్టి కోసం పొలాల కొనుగోలు, అక్కడి నుంచి మట్టి తరలింపు రెండూ జరగలేదు. నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు మొదలుకొని నాగనూలు, తుడుకుర్తి, బావాజీపల్లి, వడ్డెమాన్, నల్లవెల్లి, శ్రీపురం, పాలెం, మంగనూర్, లట్టుపల్లి, బలాన్​పల్లి, నేరేళ్లపల్లి, బుద్దసముద్రం, ఆవంచ చెరువుల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా వందలాది టిప్పర్ల ద్వారా నల్లమట్టిని తోడేశారు. మిషన్​కాకతీయలో రైతుల పొలాల్లోకి చేరాల్సిన నల్లమట్టి వట్టెం కట్ట కిందికి చేరింది. అందులో కూడా వర్క్​రికార్డు చేశారు. ఎర్రమట్టి తరలింపునకు క్యూబిక్​ మీటర్​కు రూ.200 వరకు ఇచ్చారు. దీన్ని రిజర్వాయర్​ బెడ్​ నుంచి అనుమతించారు. తక్కువయితే బయటి నుంచి తెచ్చుకోవాలి. దీనికోసం వట్టెం వెంకన్న ఆలయం ఉన్న గుట్టకు 50 మీటర్ల దూరం నుంచి  టెండర్​ పెట్టారు. భారీ బ్లాస్టింగులతో సగం గుట్టను కరిగించారు. గుట్టను పూర్తిగా తవ్విన తర్వాత నిర్వాసితులకు డబుల్​ బెడ్​రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని నమ్మించారు. మట్టికోసం కేటాయించిన మొత్తంలో దాదాపు రూ.300 కోట్ల పైచిలుకు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. కట్టకు ఎంతో ముఖ్య మైన నల్లమట్టి రోలింగ్, దానికి ఇరువైపులా 300 మీటర్ల వెడల్పున పోయాల్సిన ఎర్రమట్టి స్థానంలో గుట్టలు తవ్వి తెచ్చిన మొరం, రాళ్లు పోసి రోలింగ్ ​చేశారు.

సేఫ్టీ గాలిలో దీపమేనా..

భూసేకరణ, నిధుల కేటాయింపు, నిర్వాసితుల పరిహారం, ఇతర పనుల్లో సమస్యలు సర్వ సాధారణమే. అయితే పాలమూరు ప్రాజెక్టులో అతి ముఖ్యమైన రిజర్వాయర్​కట్ట నిర్మాణంలో క్వాలిటీ, సేఫ్టీ అంశాలు అందరినీ భయపెడుతున్నాయి.  వట్టెం రిజర్వాయర్​భవిష్యత్​పై సామాన్య రైతులతో పాటు రిటైర్డ్​ ఇంజనీర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్యాచ్​ల కనెక్టింగ్​కు మెట్లు, రీబిల్డప్​ మెకానిజం అసాధ్యం కాకపోయినా భద్రతకు పెనుసవాల్​గా నిలుస్తుందన్న భయాందోళనలున్నాయి.

కట్టకు ఎందుకీ ప్యాచులు? 

పాలమూరు–రంగారెడ్డిలోని వెంకటాద్రి రిజర్వాయర్​ పనులలో కట్ట బాటమ్​ విడ్త్, ఎత్తు  నిర్మాణంలో ఎటువంటి ప్యాచులు లేకుండా నిర్మించాల్సి ఉంది. అత్యవసరమైతే తప్ప చిన్న ప్యాచ్​లనూ అనుమతించరు. అటువంటిది వట్టెం కట్ట 9వ ప్యాకేజీలో నిర్మిస్తున్న 4 కి.మీ.ల పొడవులో ఏకంగా ఐదు చోట్ల భారీ ప్యాచులు వచ్చాయి. ఒకచోట 500 మీటర్లు, మరోచోట 300 మీటర్లు, మరో మూడుచోట్ల 50 మీటర్లకు పైగా పొడవున ప్యాచులు వదిలేశారు. 2013  భూసేకరణ చట్టం,123 జీవో, 2107లో సవరించిన చట్టప్రకారం తమకు  పరిహారం చెల్లించాలని కారుకొండ, వట్టెం రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఎకరాకు రూ.2.15 లక్షలకు మించి ఇవ్వమని బెదిరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకుపోయారు. పరిహారం కేసు కోర్టులో ఉండటంతో కాంట్రాక్టర్​ఆయా రైతులకు సంబంధించిన పొలాలు ఉన్న ప్రాంతాలను వదిలేసి కట్ట నిర్మాణ పనులు చేపట్టారు.