
- డిజిటల్ మెడికల్ మ్యాపింగ్
- గ్రేటర్లో అన్ని ప్రాంతాలు కవరయ్యేలా త్వరలో ప్రోగ్రామ్
- ఇప్పటివరకు కవర్ కాని.. మిస్సయిన ప్రాంతాల గుర్తింపు
- యూనిసెఫ్ సహకారంతో నిర్వహణ
- పీహెచ్సీలు, బస్తీ దవాఖానలు, ఆశాలు, ఏఎన్ఎంల పరిధుల నిర్ధారణ
- ప్రతి ఇంటికి వైద్యం, వాక్సినేషన్ అందించడమే లక్ష్యం
హైదరాబాద్, వెలుగు: సిటీలో వైద్య సేవలు మెరుగుపరచడం, విస్తరించడం, ప్రతి వ్యక్తికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నది. ఇప్పటివరకు కవరేజ్‌లో లేని ప్రాంతాలు, ఇండ్లు, అపార్ట్మెంట్లు గుర్తించి వీటి సమీపంలో ఉండే పీహెచ్సీలు, బస్తీ దవాఖానలు..సేవలందించే ఆశాలు, ఏఎన్ఎమ్ లను ఒక కచ్చితమైన పరిధిలోకి తీసుకురావడానికి యూనిసెఫ్ సహకారంతో మెడికల్ డిజిటల్ మ్యాపింగ్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నది.
సేకరించనున్న డేటాతో అవసరం అనుకున్న చోట కొత్తగా హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆశాలు, ఏఎన్ఎంల సంఖ్యను పెంచనున్నారు. దీనిపై మంగళవారం నేషనల్ ఇన్స్టిట్యూట్ఆఫ్అర్బన్ మేనేజ్మెంట్(ఎన్ఐయూఎమ్) లోని కాన్ఫరెన్స్ హాల్లో యూనిసెఫ్, ఎన్ఐయూఎమ్ ప్రతినిధి బృందంతో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి, ఇతర అధికారులతో మెడికల్ డిజిటల్ మ్యాపింగ్పై సమావేశం నిర్వహించారు. డేటా సేకరణ, అమలు విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చర్చించారు.
కచ్చితమైన పరిధులతో వైద్య సేవలు
మహానగరం రోజురోజుకూ విస్తరిస్తున్నది. కొత్త అపార్ట్మెంట్లు, ఇండ్లు పుట్టుకొస్తున్నాయి. అయితే, ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరి ఖచ్చితమైన డేటా ఇంతవరకు లేదు. ఎంత జనాభా ఉందో తెలియకుండా అందరికీ కావాల్సిన వైద్య సదుపాయాలను కల్పించడం కష్టమే...అందుకే గ్రేటర్లో ప్రతి వ్యక్తికీ వైద్యం అందించాలనే లక్ష్యం నెరవేరడం లేదు. సాధారణంగా ప్రతి 50 వేల జనాభాకు ఒక యూపీహెచ్సీ, ప్రతి 10వేల మందికి ఒక బస్తీ దవాఖాన, ప్రతి 2,500 మందికి ఒక ఆశా , ప్రతి 10 వేల మందికి ఒక ఏఎన్ఎమ్ ఉండాలి.
ప్రస్తుతం గ్రేటర్ జనాభా కోటి దాటింది. హైదరాబాద్ జిల్లాలో 91 యూపీహెచ్సీలు, 169 బస్తీ దవాఖానాలు, 1613 ఆశాలు, 318 ఏఎన్ ఎమ్ లు ఉన్నారు. సిటీ విస్తరణ, జనాభా పెరిగే కొద్దీ ఏఎన్ఎం, ఆశాల పరిధి నిర్ణయించడంలో సమస్యలు ఏర్పడి గర్భిణులకు వైద్య సేవలు, వాక్సినేషన్ అందించడంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. డిజిటల్మెడికల్మ్యాపింగ్ద్వారా ఆయా విభాగాల కచ్చితమైన పరిధులు నిర్ణయించి వైద్య సేవలను, సదుపాయాలను, సిబ్బందిని పెంచే అవకాశం ఉంటుంది.
అత్యాధునిక టెక్నాలజీతో..
డిజిటల్ మెడికల్మ్యాపింగ్, డేటా సేకరణకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించబోతున్నారు. డేటాను సమర్థవంతంగా నిర్వహించడానికి క్యూజీఐఎస్ అనే ఓపెన్-సోర్స్ జీఐఎస్ సాఫ్ట్‌వేర్‌ను, ఫీల్డ్ సర్వేల కోసం క్యూఫీల్డ్ అనే మొబైల్ యాప్‌ను ఉపయోగించనున్నారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఇంటింటి సర్వేల ద్వారా జనాభా, వారి ఆరోగ్య అవసరాలు, వ్యాక్సిన్ రికార్డులను సేకరించన్నారు. ఆయా ఇండ్లు ఏ ప్రాంతంలోని పీహెచ్సీలు, బస్తీ దవాఖానలు, ఆశా, ఏఎన్ఎమ్ పరిధిలోకి వస్తాయో తెలుసుకుని పరిధులు నిర్ణయించనున్నారు. ఈ డేటా ఆధారంగా ఏ ప్రాంతంలో ఎక్కువ వైద్య సేవలు అవసరమో గుర్తించి, కొత్తగా సెంటర్లను ఏర్పాటు చేయడం, సిబ్బంది సంఖ్యను పెంచడం వంటి చర్యలు తీసుకోనున్నారు.
వైద్య సేవలు మెరుగుపరచాలనే..
ప్రతి ఇంటికి తిరిగి డేటాను సేకరించి, వైద్య సేవలను మెరగుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మ్యాపింగ్ ద్వారా వైద్య సేవలను మెరుగుపరచడమే కాదు, మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎంతమంది ఉన్నారు? వారికి ఏయే వైద్య సేవలు అవసరమవుతాయో తెలుసుకొని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయవచ్చు.
డాక్టర్. జె వెంకటి, డీఎంహెచ్ఓ, హైదరాబాద్