
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో సోమవారం (ఆగస్టు 18) జరిగిన మందుపాతర పేలుడులో ఓ జవాన్ మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
నక్సలైట్లు అమర్చిన ఐఈడీ (Improvised Explosive Device) ఒక్కసారిగా పేలడంతో ఛత్తీస్‌గఢ్ పోలీస్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)కి చెందిన ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు జవాన్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఈ ప్రాంతంలో పోలీసులు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో రాష్ట్ర పోలీసు విభాగాలైన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) ,స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సంయుక్త బృందం పాల్గొంది.
గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో నక్సలైట్ల దాడులు పెరిగాయి. గురువారం తెల్లవారుజామున కూడా బీజాపూర్‌లోని బైరామ్‌గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే తరహా ఐఈడీ పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ఒక డీఆర్జీ సిబ్బంది గాయపడ్డారు.
ఇదిలా ఉండగా జూన్ 9న సుక్మా జిల్లాలో ఒక రాతి క్వారీలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలి అదనపు పోలీసు సూపరింటెండెంట్ (కొంటా డివిజన్) ఆకాశ్‌రావు గిరేపుంజే మరణించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు అధికారులు కూడా గాయపడ్డారు.