
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం బలపడి రేపు ( ఆగస్టు19) తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం దక్షిణ ఒడిశా.. -ఉత్తరాంధ్ర ప్రాంతాల దగ్గర తీరాం దాటే అవకాశం ఉంది.
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడ్రోజులు ( ఆగస్టు 18 నుంచి) రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, ఆదిలాబాద్, హనుమకొండ, వరంగల్, కామారెడ్డి, ఖమ్మం, కొమురంభీమ్, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి,మెదక్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సోమవారం ( ఆగస్టు 18) కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయి. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయి. ఇక విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయి. కోనసీమ ప్రాంతంలో తూర్పు గోదావరి. పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరుగా ముసురు పట్టి వర్షాలు పడతాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు
మత్స్యకారులు చేపట వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.