ఇందిరమ్మ ఇంటికి పైసలడిగితే చర్యలు : మంత్రి జూపల్లి

ఇందిరమ్మ ఇంటికి పైసలడిగితే చర్యలు : మంత్రి జూపల్లి
  • ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి

పాన్ గల్, వెలుగు: అధికారులు, నాయకులు ఎంతటి వారైనా ప్రజల నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. పాన్​గల్​ మండలం తెల్లారాళ్లపల్లి తండా, వెంగళాయపల్లి గ్రామాల్లో ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆయన ప్రొసీడింగ్స్ అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ లంచాలు అడిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. వారం రోజుల్లో సమగ్ర విచారణ జరిపి తుది నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. 

మొదటి విడతగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వచ్చాయని, ఇందులో పాన్​గల్ మండలానికి 596 ఇండ్లు మంజూరైట్లు చెప్పారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో సమావేశమైన లబ్ధిదారుల్లో ఎవరైనా అనర్హులుంటే చెప్పాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, మాజీ ఎంపీపీ వెంకటేశ్​ నాయుడు, మాజీ జడ్పీటీసీ రవి ఎంపీడీవో గోవిందరావు  పాల్గొన్నారు.