
పెళ్లంటే నూరేళ్ల పంట’’అంటుంటారు. పెళ్లి ఓ పవిత్ర బంధం..వివాహ బంధాన్ని కాపాడుకుంటూ ఆస్వాదిస్తేనే ఆనందం అన్నారు. గతంలో పెళ్లితో ఒక్కటైన జంటలు షష్టి పూర్తి చేసుకున్న సందర్భాలు కనిపించేవి. అయితే ఇప్పుడు అంతా గందరగోళం..ఏ క్షణాన విడిపోతారో కూడా తెలియని పరిస్థితుల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా జరిగిన పెళ్లి పెటాకులు అయిన ఘటన ఇందుకు ఓ ఉదాహరణ..
రాజస్థాన్‌లో ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పెళ్లివేడుక.. నాటకీయ టెలివిజన్ షోలా ముగిసింది. ఏడుగులు వేయాల్సని వరుడు.. ఆరడుగులు వేసి.. మధ్యలో ఓ ఫోన్ కాల్ రావడంతో ఏడో అడుగు వేయకుండా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. అక్కడున్నవారంతా షాక్. ఏం జరిగిందో తెలుసుకునేందుకు బంధువులు, స్నేహితులు ప్రయత్నించారు. ఒప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయినా వరుడు ఒప్పుకోలేదు.
అకస్మాత్తుగా వరుడు పెళ్లి రద్దు చేసుకోవడంతో వధువు పేరెంట్స్ గొడవకు దిగారు.వరుడు, అతని తల్లిదండ్రులు, బంధువులను బంధించారు. లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి వేడుకలకు ఏర్పాట్లు చేశాం.. ఆ డబ్బును చెల్లించాల్సిందే అని పట్టుబట్టారు.
వరుడు పెళ్లి రద్దు చేసుకునేందుకు ఖచ్చితమైన కారణాలు తెలియపోయినప్పటికీ అగ్నిసాక్షిగా ఏడడుగులు వేస్తున్న సమయంలో ఓ యువతి చేసిన ఫోన్ కాల్ పెళ్లికాన్సిల్ చేసుకునేందుకు కారణమైందని వధువు తరపు బంధువులు ఆరోపించారు.
సమాజాల్లో కుటుంబ వ్యవస్థతో పాటు వివాహం అత్యంత కీలకమైంది. సమాజాభివృద్ధికి మూలం వివాహ వ్యవస్థ. చుట్టు ఉన్న సమాజం ఆమోదంతో లేదా చట్టపరమైన అంగీకారంతో స్త్రీపురుషులిద్దరూ కలిసి జీవించడం, ఓ బాండింగ్ ఏర్పరుచుకునేదే పెళ్లి.
భార్యాభర్తల మధ్య సంబంధం..ముఖ్యంగా శారీరక సంబంధం, తద్వారా సంతానం, వారిద్దరు కలిసి జీవించడానికి పెళ్లి ద్వారా సమాజం ఆమోదించి వారికి అండగా ఉంటుంది.భారతీయ సమాజంలో స్త్రీ, పురుషులిద్దరూ వివాహం ద్వారానే సంతానాన్ని పొందాలి. కుటుంబ వ్యవస్థను కొనసాగించాలనేది భారతీయ సంప్రదాయాల్లో ఓ నియమం. అయితే నేటి టెక్ యుగంలో వివాహ వ్యవస్థపై ఎంతమందికి నమ్మకం ఉందనేది పెద్ద క్వశ్చన్ మార్క్.