
హైదరాబాద్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గత 15 సంవత్సరాలుగా చేతన్ జువెలర్స్ పేరిట ప్రగతి నగర్లో నితీష్ జైన్ అనే వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తున్నాడు.
అతని వద్దకు వచ్చే కస్టమర్ల నుంచి సుమారు రూ.10 కోట్ల విలువ చేసే బంగారం, ఆభరణాలతో నితీష్ జైన్ పరారయ్యాడు. దీంతో.. అతని బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మే10వ తేదీ నుంచి దుకాణం తెరవకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది.
స్థానికంగా ఉన్న బంగారు దుకాణాల వద్ద బంగారాన్ని తీసుకు వచ్చి ఆభరణాలు చేయడంతో పాటు కస్టమర్లకు అమ్ముతూ దుకాణదారులకు జైన్ దగ్గరయ్యాడు. తన నెట్వర్క్ను పెంచుకుంటూ అందరికీ నమ్మకం కలిగించి ఒక్కసారిగా భారీగా బంగారు ఆభరణాలతో జంప్ అయిపోయాడు.
భారీ మొత్తంలో అతనికి బంగారం ఇచ్చిన నగల దుకాణాదారులు లబోదిబోమంటున్నారు. బంగారాన్ని తాకట్టు పెట్టుకుని మరీ వడ్డీలకు ఇస్తుండే వాడని బాధితులు తెలిపారు. స్కీంలు కూడా పెట్టి బాధితులను నితీష్ జైన్ ఆకర్షించాడు. కేపీహెచ్బీ, బాచుపల్లి పరిధిలో తన వ్యాపారాన్ని నితీష్ జైన్ సాగించాడు.