డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీకి జాతీయ స్థాయిలో గుర్తింపు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీకి జాతీయ స్థాయిలో గుర్తింపు
  • న్యాయవిద్యలో దేశంలోనే ఐదో స్థానం 
  • ఇండియా టుడే సర్వేలో టాప్ టెన్ కాలేజీల్లో చోటు

హైదరాబాద్, వెలుగు: నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీకి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ కాలేజీలపై ఇండియా టుడే మేగజీన్ చేసిన సర్వేలో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. న్యాయవిద్యలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ ఐదో స్థానంలో నిలిచింది. టాప్ టెన్ లో తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక కాలేజీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీనే కావడం గమనార్హం.

టాప్ టెన్ కాలేజెస్ విత్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ ఐదో స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్ లో బనారస్ హిందూ వర్సిటీ ఫ్యాక్టలీ ఆఫ్ లా కాలేజీ, సెకండ్ ప్లేస్ లో ఫ్యాకల్టీ ఆఫ్​ లా అలీగఢ్ ముస్లిం వర్సిటీలు ఉన్నాయి. బెస్ట్ వర్సిటీలకు ఏ మాత్రం తగ్గకుండా లా ఎడ్యుకేషన్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ అత్యుత్తమ విద్యాబోధన అందిస్తున్నది. ఇప్పటికే ఈ కాలేజీ నుంచి లా పూర్తి చేసుకున్న చాలామంది విద్యార్థులు జడ్జీలుగా సెలెక్ట్ అయ్యారు.

చాలామంది అడ్వకేట్లుగా పనిచేస్తున్నారు. బడుగు బలహీన, పేద విద్యార్థులకు అతి తక్కువ ఖర్చులో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న అంబేద్కర్ కాలేజీ ఇప్పటికే పలు సర్వేల్లోనూ మంచిర్యాంకు పొందిన విషయం తెలిసిందే. కాగా, పేద విద్యార్థుల కోసం కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి అంబేద్కర్ విద్యాసంస్థల్ని స్థాపించారు. యూజీసీ నుంచి ఇటీవలే అంబేద్కర్ విద్యాసంస్థలకు అటానమస్ గుర్తింపు దక్కింది. ఇండియా టుడే టాప్ టెన్ కాలేజెస్ విత్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో ఐదో స్థానం దక్కడంపై కాలేజీ యాజమాన్యం, టీచింగ్ స్టాఫ్,  విద్యార్థులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.