
హైదరాబాద్, వెలుగు: ‘‘నాకు కరోనా పాజిటివ్ వచ్చి నాలుగు వారాలు అవుతోంది. మ్యాగ్జిమమ్ రికవర్ అయ్యాను. అయితే ఇంకొంచెం శ్వాస ఇబ్బంది ఉండడంతో ఎందుకైనా మంచిదని ఐసోలేషన్ లోనే ఉంటున్నాను. డాక్టర్లతో మాట్లాడితే కొందరు కోలుకోవడానికి 5 నుంచి 6 వారాలు పడుతుందని చెప్పారు. ఐసోలేషన్ లోనే ఉండి ఎప్పటికప్పుడు హెల్త్ చెక్ చేసుకుంటున్నాను” అని చెప్పారు న్యూయార్క్ లో డాక్టర్ గా పని చేస్తున్న మహాలక్ష్మి వెనిగళ్ల. కరోనా బారి నుంచి కోలుకున్న మహాలక్ష్మి.. వీ6, వెలుగుతో తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే…
మీకు ఎలాంటి లక్షణాలు కనిపించాయి?
కరోనా లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటున్నాయి. నాకు మొదటి రోజు అలసటగా అనిపించింది. డయోరియాతో సింప్టమ్స్ మొదలయ్యాయి. తర్వాత ఒక్కరోజే జ్వరం వచ్చి తగ్గిపోయింది. అదికూడా చాలా తక్కువ టెంపరేచర్ లో వచ్చింది. ఆ తర్వాత తల నొప్పి, గొంతు నొప్పి మొదలయ్యాయి. దగ్గు అస్సలే లేదు కానీ, ఆరో రోజు నుంచి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. ఆ తర్వాత రోజు మరింత ఎక్కువ కావడంతో హాస్పిటల్ కు వెళ్లాను. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి బాగానే ఉందని చెప్పారు. ఇంటి దగ్గరే ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. రెండు వారాల తర్వాత మిగతా లక్షణాలన్నీ తగ్గినా శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది మాత్రం ఉంది. తక్కువ లక్షణాలున్నోళ్లు తొందరగానే రికవరీ అవుతున్నారు. ఓ మోస్తరు లక్షణాలున్నోళ్లకు కొంచెం టైమ్ పడుతోంది. ఇక సివియర్ కండీషన్ ఉన్నోళ్లకు ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ అందజేస్తున్నారు.
మీరు ఒక డాక్టర్ కదా? చాలా జాగ్రత్తలు తీసుకునే ఉంటారు? అయినా వైరస్ ఎలా వచ్చిందంటారు?నేను ఎంప్లాయ్ హెల్త్ సర్వీస్ లో వర్క్ చేస్తాను. నాకు వైరస్ సోకే సమయానికి అమెరికాలో ఫ్లూ పీక్ లోనే ఉంది. ఎవరైనా ఉద్యోగులు దగ్గు, జ్వరం లాంటి ఫ్లూ లక్షణాలతో వస్తే మేం టెస్టు చేస్తాం. ఫ్లూ టెస్టుకు శాంపిల్ తీసుకునేటప్పుడు పీపీఈ లాంటి కిట్లు వాడం. ఆ సమయంలోనే కరోనా సోకి ఉంటుందని అనుకుంటున్నాను.
వైరస్ స్ర్పెడ్ కాకుండా ఉండడానికి మీరిచ్చే సలహాలు?
ఇండియాలో ఇప్పుడు విధించిన లాక్ డౌన్ చాలా మంచిది. కేసులు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు ఎవరి ఇళ్లల్లో వారు ఉండడం బెటర్. వీలైనన్ని ఎక్కువసార్లు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ముక్కు, కళ్లను చేతులతో ముట్టుకోకూడదు. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలి. కరోనా సింప్టమ్స్ అనిపిస్తే డాక్టర్ ను సంప్రదించాలి. వీలైతే వెంటనే టెస్టు చేయించుకోవాలి. తప్పనిసరిగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలి. ఎప్పటికప్పుడు డాక్టర్ తో టచ్ లో ఉంటూ మెడికల్ కేర్ తీసుకోవాలి. ఒకవేళ కండీషన్ సీరియత్ అయితే వెంటనే హాస్పిటల్ కు వెళ్లాలి.
మీ నుంచి ఇతరులకు వైరస్ స్ర్పెడ్ కాకుండా ఎలాంటి కేర్ తీసుకున్నారు?
నాకు సింప్టమ్స్ స్టార్ట్ కాగానే డౌట్ అనిపించి నేను ఐసోలేషన్ లో ఉంటానని మా ఆయనకు చెప్పాను. టెస్టు చేసుకోగా మూడు రోజుల తర్వాత పాజిటివ్ అని తెలిసింది. కంప్లీట్ గా వేరే రూమ్ లో ఉండిపోయాను. మా ఆయన ఫుడ్ అందించేవారు. ఎప్పటికప్పుడు డిస్ఇన్ఫెక్టెంట్స్ తో ఇల్లు క్లీన్ చేసేవారు. రెండు వారాల తర్వాత కొంచెం క్యూర్ అయ్యాను. 3 వారాల తర్వాత నుంచి మాస్క్, గ్లౌజులు పెట్టుకొని కిచెన్ లోకి వెళ్తున్నాను. ఇంకొంచెం సింప్టమ్స్ ఉండడంతో ఐసోలేషన్ లోనే ఉంటున్నాను.
మీ భర్త కూడా టెస్టు చేయించుకున్నారా? ఆయన ఎలా ఉన్నారు?
సింప్టమ్స్ ఎక్కువగా ఉంటేనే ఇక్కడ టెస్టులు చేస్తున్నారు. ఎందుకంటే టెస్టింగ్ కిట్లు సరిపడా లేవు. కరోనా సింప్టమ్స్ పై ఎప్పటికప్పుడు చెక్ చేసుకొమ్మని ఆయనకు చెబుతున్నాను. ఇప్పటి వరకైతే ఆయనకు లక్షణాలేవీ లేవు. మా పిల్లలు వేరే దగ్గర ఉంటారు. వాళ్లు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి సామాను ఇచ్చి వెళ్తుంటారు. వాళ్లు వచ్చినప్పుడు కూడా నేను బయటకు వెళ్లను. రూమ్ లో ఉండే మాట్లాడతాను.