రెండో అతిపెద్ద టెలికాం రంగం ఇండియాదే : డాక్టర్ పీడీ వాఘేలా

రెండో అతిపెద్ద టెలికాం రంగం ఇండియాదే : డాక్టర్ పీడీ వాఘేలా
  • ట్రాయ్​ చైర్మన్​ పీడీ వాఘేలా

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు :  ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ టెలికాం సర్వీసులలో ఇండియా ఒకటని, నేడు రెండో అతిపెద్ద టెలికాం రంగంగా ఇండియా ఎదిగిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా (ట్రాయ్​) చైర్మన్​ డాక్టర్ పీడీ వాఘేలా అన్నారు. ట్రాయ్​ నియంత్రణ సంస్థ మాత్రమేనని,  కొత్త సేవలు, సర్వీస్ ప్రొవైడర్లు వచ్చినప్పుడు తాము ప్రభుత్వానికి సిఫారసులు చేస్తామన్నారు. పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​ యూనివర్శిటీ ప్రొఫెసర్లతో శుక్రవారం జరిగిన ఇంటరాక్షన్ మీటింగ్​లో ట్రాయ్​ సెక్రటరీ వి. రఘునందన్​తో కలిసి ఆయన పాల్గొన్నారు.

దక్షిణ కొరియా ప్రభుత్వంతో కలిసి గీతం నిర్వహిస్తున్న ఇండో-కొరియన్​ విండ్​ టైర్బైన్​ ప్రాజెక్టును సంర్శించిన అనంతరం ముఖాముఖి కార్యక్రమంలో వాఘేలా మాట్లాడారు. టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో దేశంలో 170 కోట్ల మందికి మొబైల్​ సేవలు అందిస్తున్నామన్నారు. దీనికి తోడు డిజిటల్​ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చెందడం, యూపీఐ అందుబాటులోకి రావడంతో ప్రపంచంలోనే 40 శాతం డిజిటల్​ లావాదేవీలు ఇండియాలో జరుగుతున్నట్లు తెలిపారు.

త్వరలోనే 5జీ టెక్నాలజీని చౌక ధరలకు తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో కోర్​ ఇంజినీరింగ్ డీన్​ ప్రొఫెసర్​ వీఆర్​ శాస్ర్తీ, గీతం రెసిడెంట్ డైరెక్టర్​ డీవీవీఎస్​ఆర్​ శర్మ, మెకానికల్​ హెడ్​ డాక్టర్​ పి. శ్రీనివాస్​, విండ్ టైర్బైన్​ ప్రాజెక్ట్​ అసిస్టెంట్ ప్రొఫెసర్​ వీకే శ్రీధర్, ఆర్కిమెడిస్ గ్రీన్​ ఎనర్జీ సీఈఓ సూర్యప్రకాశ్​ గజ్జల తదితరులు పాల్గొన్నారు.