- కొన్ని ధనిక భూస్వామ్య కులాల లీడర్లే కారణం
- ఇప్పుడు కూడా రాజకీయ సమానత్వాన్ని
- అడ్డుకుంటున్నది ధనిక భూస్వామ్య కులాలే
సైఫాబాద్, వెలుగు : భారత ప్రజాస్వామ్యంలో రాజకీయ సమానత్వాన్ని రెండు మూడు ధనిక భూస్వామ్య కులాలే అడ్డుకుంటున్నాయని రిటైర్డ్ డీజీపీ డా. జె. పూర్ణచందర్రావు విమర్శించారు. సైఫాబాద్ లోని మీడియా సెంటర్‌లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ కు1977లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ, కొన్ని ధనిక భూస్వామ్య కులాల లీడర్లు అడ్డుకున్నారని ఆరోపించారు. ఆ పదవి మొరార్జీ దేశాయ్‌కి, తర్వాత చరణ్ సింగ్‌కు దక్కిందన్నారు.
ప్రస్తుత బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పూర్తి న్యాయం చేయడంలో విఫలమయ్యాయన్నారు. పరిపాలనలో నిర్మాణాత్మక అసమానతలు కొనసాగుతున్నాయని, కీలక శాఖలు కొన్ని కులాలకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లు ఉన్నా నిజమైన అధికార భాగస్వామ్యం అణగారిన వర్గాలకు అందడంలేదన్నారు.
