డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ క్యూ4 లాభం

డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ క్యూ4 లాభం

అంతర్జాతీయస్థాయి కలిగిన హైదరాబాద్‌‌ ఫార్మా కంపెనీ డాక్టర్‌‌ రెడ్డీస్ లాబొరేటరీస్‌‌ ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నాలుగో క్వార్టర్‌‌లో రూ.434 కోట్ల లాభం సంపాదించింది. 2017–18 ఆర్థిక సంవత్సరం క్యూ4లో వచ్చిన లాభం రూ.302 కోట్లతో పోలిస్తే ఇది 44 శాతం అధికం. గత ఏడాది మూడో క్వార్టర్‌‌లో రూ.485 కోట్ల లాభం వచ్చింది.   కంపెనీ రూ.413 కోట్ల లాభం ప్రకటిస్తుందన్న విశ్లేషకుల అంచనాలను  మించి తాజా క్వార్టర్లో లాభం ప్రకటించడం విశేషం. మొత్తం ఆదాయం రూ.3,534 కోట్ల నుంచి రూ.4,016 కోట్లకు పెరిగింది. అంటే 14 శాతం వృద్ధి నమోదయింది. క్యూ3లో మొత్తం ఆదాయం రూ.3,850 కోట్లుగా నమోదయింది. స్థూల లాభ మార్జిన్‌‌ క్యూ4లో 52.4 శాతం నమోదయింది. సీక్వెన్షియల్‌‌గా చూస్తే ఇది 150 బేసిస్‌‌ పాయింట్లు తగ్గింది.

ఫారెక్స్‌‌ రేట్‌‌ తగ్గడం, వ్యాపారపరమైన ఇబ్బందులు, అధిక ఖర్చులు ఇందుకు కారణం.  పన్నుకు ముందు లాభం (పీఏటీ) వార్షికంగా రూ.374 కోట్ల నుంచి రూ.585 కోట్లకు ఎగిసింది. క్యూ3లో పీఏటీ రూ.580 కోట్లు వచ్చింది. ఆదాయ పన్ను వ్యయాలు వార్షికంగా రూ.72 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెరిగాయి. క్యూ3లో ఇవి రూ.95 కోట్లుగా నమోదయ్యాయి. తాజా క్వార్టర్‌‌లో ఇబిటా రూ.881 కోట్లు కాగా, గత క్యూ4లో ఇది రూ.577 కోట్లు ఉంది. క్యూ3లో దీనిని రూ.865 కోట్లుగా లెక్కగట్టారు. వార్షికంగా ఇబిటా మార్జిన్‌‌ 22 శాతం పెరిగింది. పన్నుల వ్యయాలు వార్షికంగా రూ.72 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెరిగాయి.

ఉత్తర అమెరికా దేశాల నుంచి అధిక ఆదాయం

అంతర్జాతీయంగా ఆదాయాలను గమనిస్తే గ్లోబర్‌‌ జెనరిక్స్‌‌ ఆదాయం వార్షికంగా 9 శాతం పెరిగింది. ఇది రూ.2,783 కోట్ల నుంచి రూ.3,038 కోట్లకు పెరిగింది. తాజా క్వార్టర్‌‌లో ఉత్తర అమెరికా దేశాల నుంచి అత్యధికంగా రూ.1,495 కోట్ల ఆదాయం వచ్చింది. యూరప్‌‌ ఖండం నుంచి నుంచి రూ.191 కోట్ల ఆర్జించింది.  ఇక ఇండియా మార్కెట్లో క్యూ4 ఆదాయం రూ.650 కోట్లుగా నమోదయింది. గత క్యూ4లో ఇది రూ.613 కోట్లు. గత ఏడాది క్యూ3లో ఇది  రూ.674 కోట్లుగా తేల్చారు. ఇతర వర్ధమాన మార్కెట్ల నుంచి ఆదాయం వార్షిక ప్రాతిపదికన ఎనిమిది శాతం పెరిగి రూ.701 కోట్లకు చేరింది. ఫార్మాసూటికల్‌‌ సర్వీసెస్‌‌ అండ్‌‌ యాక్టివ్‌‌ ఇంగ్రీడియెంట్స్‌‌ (పీఎస్‌‌ఏఐ) సెగ్మెంట్‌‌ ఆదాయం క్యూ4లో రూ.676 కోట్లు వచ్చింది.   2019 ఆర్థిక సంవత్సరానికి రూ.20 చొప్పున ‌‌ డివిడెండ్‌‌ చెల్లించాలని బోర్డు సిఫార్సు చేసింది.

డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ 2018 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.980 కోట్లు కాగా, 2019లో ఇది ఏకంగా 92 శాతం పెరిగి రూ.1,880 కోట్లకు చేరుకుంది.  మొత్తం ఆదాయం ఎనిమిది శాతం పెరిగి రూ.15,385 కోట్లకు ఎగిసింది. కంపెనీ ఈపీఎస్‌‌ (ఎర్నింగ్‌‌ పర్‌‌ షేర్‌‌) వార్షిక ప్రాతిపదికన రూ.16.39 నుంచి రూ.27.45కు పెరిగింద. డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ షేర్లు గత ఆరు నెలల్లో 13 శాతం రాబడి ఇచ్చాయి. గత ఏడాదిలో 40 శాతం పెరిగాయి. అయితే శుక్రవారం ఈ షేరు ధర రూ.76 తగ్గి రూ.2,724 స్థాయికి చేరింది. రీసెర్చ్ అండ్‌‌ డెవెలప్‌‌మెంట్‌‌ (ఆర్‌‌అండీ) ఖర్చులు 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.1,561 కోట్లుగా నమోదయ్యాయి.

గత ఆర్థిక సంవత్సరంలో నెట్‌‌ ఫైనాన్స్ ఇన్‌‌కమ్‌‌ రూ.110 కోట్లుగా నమోదయింది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.210 కోట్లు కావడం గమనార్హం. అమెరికాలో ఈ కంపెనీ 42 ఏఎన్‌‌డీఏ (ఎబ్రివేటెడ్‌‌ న్యూ డ్రగ్‌‌ అప్లికేషన్‌‌)లను సంపాదించింది. విశాఖపట్నం జిల్ల దువ్వాడలోని ప్లాంటుకు ఇన్‌‌స్పెక్షన్ క్లోజర్‌‌ రిపోర్ట్‌‌ వచ్చింది. లేబులింగ్‌‌ దోషాల వల్ల అమెరికాలో 2,770 బ్యాగుల మూర్ఛవ్యాధి మందులను వెనక్కి తెప్పించామని కంపెనీ ఉన్నతాధికారులు తెలిపారు.