లోయలో పడ్డ ఆర్మీ ట్రక్.. తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ మృతి

లోయలో పడ్డ ఆర్మీ ట్రక్.. తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ మృతి

కారేపల్లి, వెలుగు: జమ్మూ కాశ్మీర్‌‌, శ్రీనగర్  ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్‌‌  సోమవారం చనిపోయినట్లు ఆర్మీ అధికారులు ఫ్యామిలీ మెంబర్స్‎కు సమాచారం అందించారు. డ్యూటీలో భాగంగా ఆర్మీ ట్రక్‌‌లో పెట్రోలింగ్ కు వెళ్తుండగా, ప్రమాదవశాత్తు ట్రక్‌‌ లోయలో పడిపోవడంతో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సూర్యతండాకు చెందిన అనిల్‌‌ కుమార్(30) గల్లంతయ్యాడు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆర్మీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా, డెడ్​బాడీ లభ్యమైంది. 

సెలవులపై గ్రామానికి వచ్చిన అనిల్‌‌ కుమార్ 20 రోజుల కింద విధుల్లో చేరాడు. ఈ నెల10న తన బర్త్​డే సందర్భంగా భార్య, ఫ్యామిలీ మెంబర్స్‎తో మాట్లాడాడు. తోటి జవాన్లతో బర్త్​డే జరుపుకున్న ఫొటోలను కుటుంబ సభ్యులకు షేర్ చేశాడు. ఇంతలోనే అనిల్​కుమార్​ చనిపోయినట్లు ఆర్మీ అధికారులు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి భార్య రేణుక, 8 నెలల బాబు ఉన్నారు. అనిల్‌‌ మృతితో తండాలో విషాదం నెలకొంది.