వెంటనే పెన్షన్ అప్డేషన్ చెయ్యాలి

 వెంటనే పెన్షన్ అప్డేషన్ చెయ్యాలి
  • ధర్నా చౌక్ లో పెన్షనర్ల మహాధర్నా

ముషీరాబాద్, వెలుగు: బ్యాంకింగ్ రంగంలో రిటైర్డ్ అయిన పెన్షనర్ల కోసం రూ.4.5 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ అందుబాటులో ఉన్నప్పటికీ.. పెన్షన్ నవీకరణ అమల్లో కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని ఆల్ ఇండియా బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైర్స్ కాన్ఫరేషన్ ఏపీ,- తెలంగాణ యూనిట్ మండిపడింది. పెన్షన్ అప్డేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో మహాధర్నా చేపట్టారు. భారీగా హాజరైన పెన్షనర్లను ఉద్దేశించి కాన్ఫరేషన్ ప్రతినిధులు ఎం చక్రపాణి, మధుసూదన్, సురేశ్ బాబు, రోహిణి రావు, ఉప్పు సుధాకర్ మాట్లాడారు. 

పెన్షన్ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినప్పటికీ అమలులో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. 75 ఏండ్లు పైబడిన పెన్షనర్ల పట్ల ప్రభుత్వానికి సానుభూతి లేకపోవడం బాధాకరమని, వెంటనే పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. లేకపోతే దేశవ్యాప్తంగా కార్యచరణ చేపడతామని హెచ్చరించారు.

పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించాలి

ఈహెచ్ఎస్ స్కీమ్ ద్వారా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించేందుకు విధివిధానాలు వెంటనే ఏర్పాటు చేసి అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఆయన హాజరై మద్దతు తెలిపారు.