రాజ్యాంగ పరిరక్షణ కోసమే పోరు : రాహుల్గాంధీ

రాజ్యాంగ పరిరక్షణ కోసమే పోరు : రాహుల్గాంధీ
  • ఓట్​ చోరీ సాక్ష్యాలను జనం ముందుంచాం: రాహుల్​గాంధీ

న్యూఢిల్లీ, వెలుగు: ఇది రాజకీయ పోరాటం కాదని, రాజ్యాంగ పరిరక్షణ కోసమని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. వాస్తవం ఏమిటనేది దేశం ముందు ఉందని తెలిపారు. తమకు చివరి ఏడు ఎన్నికల ఓటర్ లిస్ట్ కావాలని ఈసీని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ఒక వ్యక్తి – ఓకే ఓటు హక్కు కోసం మేం ఈ ఉద్యమాన్ని చేస్తున్నం” అని తెలిపారు. పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ అయిన తర్వాత ప్రియాంక గాంధీ, ఇతర ఎంపీలతో కలిసి రాహుల్ తిరిగి పార్లమెంట్​కు చేరుకున్నారు. ఈ సందర్బంగా మకర ద్వార్ ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల సంఘానికి మెమోరాండం ఇవ్వాలనుకున్నం. కానీ, ఎంపీలకు ఈసీ అనుమతి ఇవ్వలేదు. ఈ పోరాటం రాజకీయం కోసం కాదు.. రాజ్యాంగం కోసం, వన్ మ్యాన్ వన్ ఓటు కోసం’’  అని పేర్కొన్నారు. కర్నాటక లోక్​సభ ఎన్నికల్లో ఓట్ చోరీసాక్ష్యాలు జనం ముందు ఉంచానని తెలిపారు. తాము చేస్తున్న పోరాటంతో ఎన్నికల కమిషన్  ఇక నిజాన్ని దాచలేదని ఆయన పేర్కొన్నారు. 

ఎందుకు సంతకం చేసి ఇవ్వాలి?

2024 లోక్​సభ ఎన్నికల్లో జరిగిన ఓట్ల దొంగతనంపై తాను చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన పత్రాలు ఎన్నికల సంఘం నుంచి తీసుకున్నవేనని రాహుల్​గాంధీ స్పష్టం చేశారు. ‘‘అవి నా సొంత డేటా నుంచి సేకరించినవి కావు. ఈ అంశంపై ఇండియా బ్లాక్ లోని 300 మంది ఎంపీలు చర్చించేందుకు ముందుకు వస్తే.. ఈసీ నిరాకరించింది. నేను ఎందుకు నా ఆరోపణలపై సంతకం చేసి ఈసీకి ఇవ్వాలి? ఇది ఎన్నికల సంఘం నుంచి తీసుకున్న డేటానే. ఓట్​ చోరీ బెంగళూరులో మాత్రమే జరిగిందని ఎవరూ అనుకోకూడదు. ఏదో ఒకరోజు వాస్తవం బయటకు వస్తుంది” అని ఆయన అన్నారు. 

ఈసీ ఎందుకు వింటలే: ఖర్గే

ప్రతిపక్ష ఎంపీలంతా శాంతియుతంగా ర్యాలీ చేస్తే కేంద్ర ఎందుకు భయపడుతున్నదని ఏఐసీసీ చీఫ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ‘‘ఎన్నికల కమిషన్ వద్దకు చేరుకోకుండా అడ్డుకుంటున్నది. మోదీ సర్కార్​ దేనికి భయపడుతున్నదో మాకు అర్థం కావడం లేదు? ఈ ర్యాలీలో ఎంపీలు మాత్రమే పాల్గొన్నారు. మేం శాంతియుతంగానే  ర్యాలీ చేపట్టాం. ఎన్నికల కమిషన్ ప్రతిపక్ష ఎంపీలను పిలుస్తుందని మేం ఆశించాం.. మా అభిప్రాయాలను తెలియజేయాలనుకున్నాం. కానీ 30 మంది సభ్యులను మాత్రమే రావాలని చెప్తున్నది. 

అది ఎలా సాధ్యం?’’ అని ఆయన అన్నారు. ప్రతిపక్ష ఎంపీల ర్యాలీని అడ్డుకోవడం అంటే.. పార్లమెంట్​ వెలుపల ప్రజాస్వామ్యంపై దాడేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ మండిపడ్డారు. ఎంపీలను అరెస్ట్​ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్ అన్నారు.

మోదీ సర్కార్​కు భయం: ప్రియాంక

ప్రతిపక్షాల బలాన్ని చూసి మోదీ సర్కార్ భయపడ్తున్నదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి బస్సులో ఎక్కించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ సర్కార్​కు భయం పట్టుకుంది.వాళ్లు పిరికివాళ్లు. ఓటు చోర్.. గద్దె దిగాలి’’ అని డిమాండ్​ చేశారు. బస్సులోనే సహచర ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇన్ని ఆంక్షలా?: సంజ‌‌‌‌య్ రౌత్‌‌‌‌

ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు నిరసన చేయడానికి కూడా ఇన్ని ఆంక్షలు ఎందుకని ఎస్ఎస్–-యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్  నిలదీశారు. ఎంపీలేమైనా టెర్రరిస్టులా? అని మండిపడ్డారు. ర్యాలీలో పాల్గొన్న ఎంపీలను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అన్నారు. 

అడ్డుకోవడం ఏమిటి?: అఖిలేశ్ 

పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ వీధుల్లో నడవడానికి అనుమతి అవసరం లేదని సమాజ్​వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్​ యాద‌‌‌‌వ్‌‌‌‌ అన్నారు. ‘‘ఢిల్లీ వీధుల్లో నడవడానికి ఎంపీలకు అనుమతి కావాల్నా? ఈసీని కలువడానికి వెళ్తే పోలీసులు అడ్డుకోవడం ఏమిటి?” అని ఆయన మండిపడ్డారు. 

ఈసీ ఎవరి ఒత్తిడితో పనిచేస్తున్నది: మీసా భార‌‌‌‌తి

ఎంపీల‌‌‌‌ను క‌‌‌‌ల‌‌‌‌వ‌‌‌‌డానికి ఎన్నికల క‌‌‌‌మిష‌‌‌‌న్ ఎందుకు భ‌‌‌‌య‌‌‌‌ప‌‌‌‌డుతున్నదని ఆర్జేడీ ఎంపీ మీసా భార‌‌‌‌తి ప్రశ్నించారు. ‘‘ఎన్నికల కమిషన్ ఎవరి ఒత్తిడితో పనిచేస్తున్నది? ఎంపీలను కలవడానికి ఎందుకు భయపడుతున్నది” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.