
న్యూఢిల్లీ: ఫార్మా ప్రొడక్టులు తయారు చేసే హైదరాబాద్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్‌కు ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి క్వార్టర్లో రూ. 1,417.8 కోట్ల నికరలాభం వచ్చింది. ఇది ఏడాది లెక్కన రెండుశాతం పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ. 1,392 కోట్లు వచ్చాయి. కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం ఏడాది లెక్కన 11 శాతం పెరిగి రూ. 8,545.2 కోట్లకు చేరుకుంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో రూ. 7,672.7 కోట్లుగా ఉంది.
కంపెనీ గ్రాస్ మార్జిన్ 56.9 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 60.4 శాతంగా ఉంది. "గత సంవత్సరం ఇదే కాలంలో మేం రెండంకెల వృద్ధిని సాధించాం. ఇది బ్రాండెడ్ మార్కెట్లలో మా బలాన్ని, మా నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ పోర్ట్‌ఫోలియోలో బలమైన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. యూఎస్ జెనరిక్స్ మార్కెట్‌లో లెనాలిడోమైడ్‌పై ధరల ఒత్తిడి పెరుగుతుందని అనుకుంటున్నాం” అని కంపెనీ కో–చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ అన్నారు.
ఉత్తర అమెరికాలో, డాక్టర్ రెడ్డీస్ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో రూ. 3,410 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఇది ఏడాది లెక్కన 11 శాతం తగ్గింది. లెనాలిడోమైడ్ వంటి కీలక ఉత్పత్తుల ధరలు పడిపోయాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో, 2026 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో ఆదాయం 18 శాతం పెరిగి రూ. 1,400 కోట్లకు చేరుకుంది. యూరప్ మార్కెట్‌నుంచి ఆదాయం రూ. 1,270 కోట్లు ఉంది. ఇది ఏడాది లెక్కన 142 శాతం పెరిగింది. డాక్టర్ రెడ్డీస్ రిజల్ట్స్ మార్కెట్ తర్వాత విడుదలయ్యాయి. బుధవారం స్టాక్ 0.65 శాతం పెరిగి రూ. 1,248.00 వద్ద ముగిసింది.