ఏటా 18 లక్షల మందికి పక్షవాతం .. అందులో 25 శాతం మంది 40 ఏండ్లలోపు వారే : డాక్టర్ విజయ

ఏటా 18 లక్షల మందికి పక్షవాతం .. అందులో 25 శాతం మంది 40 ఏండ్లలోపు వారే : డాక్టర్ విజయ
  • పక్షవాతానికి ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్‌‌మెంట్‌‌ అందుబాటులో ఉంది 
  • ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ 

హైదరాబాద్, వెలుగు:  దేశంలో ఏటా 18 లక్షల మంది పక్షవాతం బారిన పడుతున్నారని, వారిలో 25 శాతం మంది 40 ఏండ్ల లోపు వారే ఉన్నారని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్‌‌‌‌ విజయ ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మందిలో పక్షవాతానికి వైద్యం లేదనే అపోహ ఉందని, అయితే, ప్రస్తుతం ఎవిడెన్స్ బేస్డ్ చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రజల్లో అవగాహన లేక ఒక శాతం మందే ఈ చికిత్సలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ (ఐఎస్ఏ), అసోసియేషన్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ (ఏపీఐ), సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (ఎస్ఈఎంఐ) కలిసి సంయుక్తంగా ఆదివారం ‘బ్రెయిన్ స్ట్రోక్ టైమ్ టు యాక్ట్’అనే అవగాహన కార్యక్రమాన్ని హైదరాబాద్‌‌లో నిర్వహించారు. 

ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలు, నగరాల్లో పక్షవాతం చికిత్సకు సంబంధించి అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐఎస్ఏ ట్రెజరర్ డాక్టర్ సలీల్ ఉప్పల్ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి హైపర్ టెన్షన్ ఉంది. ఈ వ్యాధి తమలో ఉందని 50 శాతం మందికే తెలుసు. కేవలం 12 శాతం మందికి మాత్రమే బీపీ నియంత్రణలో ఉన్నది. హై బీపీ బ్రెయిన్ 
స్ట్రోక్‌‌కు ప్రధాన కారణం అవుతుంది”అని ఆయన అన్నారు.

బీ ఫాస్ట్ (Be fast) ఫార్ములాపై అవగాహన అవసరం..

 పక్షవాత సంకేతాన్ని గుర్తించేందుకు బీ ఫాస్ట్ ఫార్ములాపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. బీ -అంటే బ్యాలెన్స్ కోల్పోవడం (Balance loss), ఈ – కళ్లు మసకగా కనపడటం (Blurred Vision), ఎఫ్‌‌– -మూతి వంకర పోవడం (Face drooping), ఏ- – చేయి చచ్చుబడిపోవడం (Arm weakness), ఎస్‌‌– మాటలో ముద్దగా రావటం (Speech difficulty), టీ– -అత్యవసర సేవలకు కాల్ చేయడానికి సమయం (Time to call emergency services) (బీ ఫాస్ట్) ఆవశ్యకతపై వక్తలు అవగాహన కల్పించారు.

 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ ఏడాదికి ఒక్కసారైనా బీపీ చెక్ చేయించుకోవాలన్నారు. బీపీ 140/90 కంటే ఎక్కువగా ఉంటే వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలా చేస్తే 50 శాతం బ్రెయిన్ స్ట్రోక్స్‌‌ను నివారించవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరోలాజిస్టులు, ఎమర్జెన్సీ ఫిజిషియన్లు పాల్గొన్నారు.