బీసీలకు 42శాతం రిజర్వేషన్లు: రాజ్‌భవన్‌కు ఆర్డినెన్స్ ముసాయిదా

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు: రాజ్‌భవన్‌కు ఆర్డినెన్స్ ముసాయిదా
  • పంచాయతీరాజ్‌‌ చట్టం–2018లోని సెక్షన్ 285ఏ సవరిస్తూ ఆర్డినెన్స్‌‌ ముసాయిదా 
  • ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు అమలవుతాయని నిబంధనల్లో మార్పు
  • ఒకట్రెండు రోజుల్లో గవర్నర్ ఆమోదించే చాన్స్ 
  • ఆ తర్వాత 42% కోటా అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్న సర్కార్‌‌ 

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం రూపొందించిన ఆర్డినెన్స్‌‌‌‌ ముసాయిదా రాజ్‌‌‌‌భవన్‌‌‌‌కు చేరింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌‌‌‌ చట్టం–2018లో సవరణలకు ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫైల్‌‌‌‌ను గవర్నర్‌‌‌‌ జిష్ణుదేవ్ వర్మకు పంపించింది. ప్రస్తుతమున్న చట్టంలో సెక్షన్ 285ఏ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే నిబంధన ఉంది. 

అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఈ సెక్షన్‌‌‌‌ను సవరించాలని, అందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని ఇటీవల కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెక్షన్ 285ఏను సవరిస్తూ, 50 శాతానికి మించకూడదనే నిబంధనను తొలగించి.. ఆర్డినెన్స్ ముసాయిదాను తయారు చేసింది. ఎంపిరికల్​డేటా ఆధారంగా రిజర్వేషన్లు అమలవుతాయని అందులో పేర్కొన్నట్టు తెలిసింది. 

ఈ ఫైలును న్యాయశాఖ, పంచాయతీరాజ్ మంత్రి, సీఎం ఆమోదం తర్వాత.. గవర్నర్‌‌‌‌‌‌‌‌కు పంపించారు. మంగళవారం చెన్నై పర్యటనకు వెళ్లిన గవర్నర్​.. సాయంత్రానికి తిరిగి హైదరాబాద్​ చేరుకున్నారు. ఈ ఫైల్‌‌‌‌పై ఒకట్రెండు రోజుల్లో గవర్నర్​ నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం భావిస్తున్నది. ఆర్డినెన్స్‌‌‌‌కు గవర్నర్​ఆమోదం తరువాత నోటిఫికేషన్​జారీ చేయనుంది. 

ఆ వెంటనే కులగణన సర్వే ఎంపిరికల్​డేటా, అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లు ప్రకారం.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనుంది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో  రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు నెల రోజులు గడువు విధించింది. దీంతో ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.