
బీజింగ్: చైనాలో పర్యటించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని డ్రాగన్ కంట్రీ స్వాగతించింది. తియాంజిన్ లో ఈ నెలాఖరున జరగనున్న షాంఘై సమిట్ కు నరేంద్ర మోదీని చైనా సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గ్వో జియాకున్ పేర్కొన్నారు. దేశాల మధ్య పరస్పర సహకారం, సంఘీభావం, చైతన్యంతో గొప్ప ఫలితాలను పొందవచ్చని చైనా నమ్ముతుందన్నారు.
షాంఘై సమిట్ ద్వారా సభ్య దేశాలకు ఈ ఫలితాలు అందుతాయని, సమష్టిగా అభివృద్ధి పథంలో ముందుకెళతాయని తెలిపారు. స్నేహం, పరస్పర సంఘీభావంతో ఈ సమిట్ సత్ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నట్లు గ్వో తెలిపారు. సభ్య దేశాల అధినేతలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల చీఫ్ లు మొత్తం 20 మంది ఈ సమిట్ కు హాజరవుతారని వివరించారు. ఈ నెల 31, సెప్టెంబర్ 1.. రెండు రోజుల పాటు తియాంజిన్ లో ఈ సమిట్ జరుగుతుందని గ్వో తెలిపారు.