
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత మహేశ్ సోని కొడుకు విశాల్ సోని(30).. రూ. 1.40 కోట్ల బ్యాంకు లోన్ ఎగ్గొట్టేందుకు చనిపోయినట్లు నాటకమాడాడు. అయితే, మొబైల్ కాల్ డీటెయిల్ రికార్డుల (సీడీఆర్) ఆధారంగా విశాల్ సోని బతికే ఉన్నాడని గుర్తించిన పోలీసులు..అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే..ఈ నెల 5న కాలిసింధ్ నదిలో ఓ కారు మునిగిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. అధికారులు కారును బయటకు తీసి చూడగా అందులో ఎవరూ కనిపించలేదు. కారు విశాల్ సోనిదని గుర్తించిన పోలీసులు.. మొత్తం 20 కి.మీ. పొడవైన నదిలో మూడు బృందాలతో సెర్చ్ చేశారు.
స్టేట్ డిజాస్టర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఈఆర్ఎఫ్) సహాయంతో రెండు వారాల పాటు నది మొత్తం గాలించారు. ఎంత వెతికినా విశాల్ ఆచూకీ లభించకపోవడంతో..అతని మొబైల్ కాల్ రికార్డులను సేకరించారు. వాటి ఆధారంగా విశాల్ సోని బతికే ఉన్నాడని నిర్ధారించారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో ఫర్దాపూర్ ఏరియాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
డెత్ సర్టిఫికెట్ ఉంటే లోన్ మాఫీ అవుతుందని..
విశాల్ సోనిని విచారించిన పోలీసులు అతని మాటలు విని షాక్ అయ్యారు. విశాల్ ఆరు ట్రక్‌లు, రెండు ప్యాసింజర్ వెహికల్స్‌కు యజమాని. కానీ, రూ. 1.40 కోట్లకు పైగా బ్యాంక్ లోన్ ఉంది. డెత్ సర్టిఫికెట్ సంపాదిస్తే రుణాలు మాఫీ అవుతాయని సన్నిహితులు సలహా ఇచ్చారు. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం చనిపోయినట్లు డ్రామా ఆడినట్లు ఒప్పుకున్నాడు.
కారును నదిలోకి తోసి, తన డ్రైవర్ బైక్‌పై షిర్డీ, శని శింగనాపూర్‌లతోపాటు పలు ప్రదేశాలకు తిరిగినట్లు అంగీకరించాడు. ఫేక్ డెత్‌పై శిక్ష లేదు కాబట్టి.. పోలీసులు కూడా కేసు నమోదు చేయకుండా విశాల్‌ను తన కుటుంబానికి అప్పగించారు. అయితే, చీటింగ్ కంప్లైంట్‌పై ఫర్దాపూర్ పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది.