మిస్సయిన ఫ్లైట్ ను పట్టుకునేందుకు.. టార్మాక్‌పైకి పరిగెత్తిన మహిళ

మిస్సయిన ఫ్లైట్ ను పట్టుకునేందుకు.. టార్మాక్‌పైకి పరిగెత్తిన మహిళ

విమానం పట్టుకునే ప్రయత్నంలో కాన్‌బెర్రా విమానాశ్రయం టార్మాక్‌పైకి పరిగెత్తుతున్న ఓ మహిళా ప్రయాణీకురాలిని చూపించే వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ షేర్ అవుతోంది. అడిలైడ్‌కు బయలుదేరాల్సిన క్వాంటాస్‌లింక్ ఫ్లైట్ వైపు పరుగెత్తడానికి ముందు ఆ మహిళ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీని దాటుకుని వెళ్లిందని ఓ నివేదిక తెలిపింది.

భారీ విమానం ముందు భాగంలో చుట్టూ తిరుగుతున్న మహిళ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. పైలట్ ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేయడానికి ముందు ఆమె పైలట్ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ.. ఊహించని విధంగా అందర్నీ షాక్ కు గురి చేసింది.

నవంబర్ 1న రాత్రి 7.30 గంటలకు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్లు ఓ నేషనల్ మీడియా సంస్థ వెల్లడించింది. ఆ మహిళపై ఆస్తులకు నష్టం కలిగించడం, ఒక సెక్యూరిటీ జోన్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం, కొద్ది పరిమాణంలో గంజాయిని కలిగి ఉండటం వంటి అభియోగాలు మోపారు. అక్కడే ఉన్న సైమన్ హేల్స్ అనే వ్యక్తి ఈ సంఘటనను విచిత్రంగా అభివర్ణించారు. "తన ఫ్లైట్ మిస్ అయిన ఒక మహిళ ఆమె దాన్ని పట్టుకోగలదని నిర్ణయించుకుంది. తలుపు వద్ద ఉన్న సిబ్బందిని నెట్టివేసి, టార్మాక్‌పైకి పరుగెత్తింది. అలా విమానం వరకు వెళ్లింది" అని అతను సోషల్ మీడియాలో రాశాడు. "అక్షరాలా ముందు చక్రం పక్కన దాని కింద నిలబడి ఉంది. అదృష్టవశాత్తూ పైలట్ ఆమెను గుర్తించి హెచ్చరించి, ఇంజిన్‌ను ఆపేశాడు" అని చెప్పుకొచ్చాడు.