కౌడిపల్లి, వెలుగు: మహిళా శక్తి పథకంలో భాగంగా ప్రభుత్వం మెదక్ జిల్లాకు రూ.100 కోట్లు కేటాయించినట్టు డీఆర్డీవో శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 9 వేల మంది మహిళలకు ఆర్థిక సహకారం అందజేస్తున్నామన్నారు. గురువారం కౌడిపల్లిలోని ఇందిరా క్రాంతి పథం ఆఫీసులో సీసీలు, సీఏలు, వీవో ఏలతో సమావేశం నిర్వహించారు.
దీనికి హాజరైన డీఆర్డీవో మాట్లాడుతూ.. మహిళా శక్తి పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, మహిళా శక్తి పథకాల కింద స్వయం సహాయక సంఘాలకు రూ. 275 కోట్లు అందించాలన్నది టార్గెట్ కాగా ఇప్పటికే రూ.205 కోట్లు అందజేశామని, డిసెంబర్ వరకు రూ.275 కోట్లు అందించి 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు.
పెరటి కోళ్ల పెంపకం, డెయిరీ ఫార్మ్స్, కిరాణం షాప్, క్యాంటీన్ తో పాటు ఇతర స్వయం ఉపాధి పథకాలకు లోన్లు అందజేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో స్త్రీనిధి రీజినల్ మేనేజర్ గంగారాం, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ జాన్ రెడ్డి, స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ రజిత, ఏపీఎం సంగమేశ్వర్, సీసీలు రమేశ్, నాగరాజు పాల్గొన్నారు.