
మేడిపల్లి/ వికారాబాద్, వెలుగు: మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో హత్యకు గురైన గర్భిణి స్వాతి శరీర భాగాల కోసం మూసీ నదిలో డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు కొనసాగుతోంది. రెండో రోజైన సోమవారం ప్రతాపసింగారం మూసీ కాలువలో సుమారు 10 కిలోమీటర్ల వరకు బృందాలు వెతికినా దొరకలేదని పోలీసులు తెలిపారు. మూసీలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో చాలా దూరం వరకు కొట్టుకుపోయి ఉంటాయని భావిస్తున్నారు. ఈ నెల 23 రాత్రి స్వాతిని ఆమె భర్త మహేందర్ రెడ్డి హత్య చేశారు. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా వేరు చేసి, విడతల వారీగా ప్లాస్టిక్ కవర్లో చుట్టి మూసీ నదిలో పారేసిన సంగతి తెలిసిందే.
దీంతో మహేందర్రెడ్డి స్వగ్రామమైన వికారాబాద్మండలం కామారెడ్డిగూడలో స్వాతి కుటుంబ సభ్యులు సోమవారం ధర్నాకు దిగారు. తమ బిడ్డను ఒక ఇంటికి ఇచ్చాక ఆ కుటుంబ సభ్యులే స్వాతి శవాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు చేయాలని తల్లిదండ్రులు స్వరూప, రాములు, ఇతర బంధువులు భీష్మించుకుని బైఠాయించారు. అయితే, మహేందర్రెడ్డి ఇంటికి గత రెండు రోజులుగా తాళం వేసి ఉండగా, గ్రామ పెద్దలు కలుగజేసుకుని స్వాతి తల్లిదండ్రులను సముదాయించారు. గ్రామ పెద్దల సూచనతో తామే స్వాతి అంత్యక్రియలు చేస్తామని తండ్రి రాములు చెప్పడంతో ధర్నా విరమించారు.