డీఆర్ఎఫ్ టీమ్స్​ను..పెంచట్లేదు! సిటీలో విపత్తుల సమయంలో వీరిదే కీ రోల్​

డీఆర్ఎఫ్ టీమ్స్​ను..పెంచట్లేదు! సిటీలో విపత్తుల సమయంలో వీరిదే కీ రోల్​
  • తక్కువగా ఉండడంతో సహాయక చర్యల్లో ఆలస్యం
  • భారీ వానల టైమ్​లో బల్దియాకు వందల్లో ఫిర్యాదులు
  • గ్రేటర్​లో ప్రస్తుతం ఉన్నది 27 బృందాలు
  • కోటి జనాభాకు 100 టీమ్​లు అవసరం 

హైదరాబాద్, వెలుగు: సిటీలో ఏదైనా అనుకోని విపత్తు జరిగితే ముందుగా అక్కడికి డిజాస్టర్ రెస్పాన్స్​ఫోర్స్(డీఆర్ఎఫ్) టీమ్​లు వెళ్తుంటాయి.  వానలు, అగ్నిప్రమాదాలు, భారీ యాక్సిడెంట్లు.. ఇలాంటి విపత్తుల సమయంలో బల్దియా పరిధిలో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు డీఆర్ఎఫ్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. కోటిన్నర జనాభా ఉన్న సిటీలో ప్రస్తుతం 27 ​టీమ్స్ మాత్రమే పని చేస్తున్నాయి. తక్కువ మంది సిబ్బంది ఉండగా .. సహాయక చర్యలు అందించడంలో ఆలస్యంతో పాటు బృందాలకు పనుల్లో కష్టమవుతుంది. 

ఉన్న టీమ్ లే మొదటగా ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలకు వెళ్తాయి. అక్కడ క్లియర్​చేశాక మిగతా ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉంది. అప్పటివరకు ఆపదలో ఉన్నవారు రెస్క్యూ టీమ్స్ వస్తాయని ఎదురుచూడాల్సి వస్తుంది. మూడేళ్ల కిందట వచ్చిన భారీ వరదల సమయంలో వందలాది కాలనీలు నీట మునిగాయి. సమయానికి సహాయక చర్యలు అందకపోవడందో ఎంతో మంది తీవ్ర కష్టాలు పడుతూ గట్టెక్కారు. మరికొన్ని ప్రాంతాలకు ఎన్​డీఆర్ఎఫ్ టీమ్స్​వెళ్లాయి. అదే టీమ్స్​సరిపడా ఉంటే తక్షణ చర్యలు అందేవి. తక్కువలో తక్కువ గ్రేటర్ జనాభాకు సరిపడా 100 డీఆర్ఎఫ్​టీమ్స్​అవసరమని అధికారులు, సిబ్బంది పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, 300 డిజాస్టర్​టీమ్స్​ఏర్పాటు చేయాలని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. 

గంటల్లోనే వందల్లో కాల్స్.. 

వానాకాలంలో డీఆర్ఎఫ్ టీమ్స్​సేవలు కీలకం. చిన్నవాన పడ్డా బల్దియా హెల్ప్​ లైన్​నంబర్లకు వందల్లో కాల్స్ వస్తుంటాయి. ప్రస్తుతం 27  టీమ్స్​ ఉండగా ఎక్కడికి ఏ టీమ్​ను పంపాలో తెలియక ఉన్నతాధికారులు తలలు  పట్టుకుంటున్నారు. 24గంటలు జనావాసాల్లోనే ఉంటున్నా..  కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వెళ్తేనే డీఆర్ఎఫ్ టీమ్ సహాయక చర్యలు చేపడుతుంది. అధికారులు నుంచి కాల్​వచ్చిన ప్రాంతానికి టీమ్​ని పంపి, పనులు పూర్తయ్యాక మరోచోటికి వెళ్లాలని ఆదేశిస్తారు. పనులకు  తగ్గట్టు టీమ్స్​సంఖ్యను పెంచడం లేదు. అనవసర ఖర్చులు చేస్తున్న ప్రభుత్వం కీలమైన డీఆర్ఎఫ్ టీమ్స్ పై ఖర్చు చేసేందుకు ముందుకురావడం లేదు. 

గొప్పలు చెప్పుడే..

డీఆర్ఎఫ్ టీమ్స్ సేవలపై సీఎం కేసీఆర్ నుంచి మంత్రులు, మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు ఉన్నతాధికారులు అందరూ గొప్పగా చెబుతుంటారు. సరిపడా సిబ్బంది లేకున్నా పెంపుపై మాత్రం దృష్టి పెట్టడంలేదు. చిన్న వాన పడినా మేయర్, డిప్యూటీ మేయర్​తో పాటు అధికారులంతా డీఆర్ఎఫ్​ టీమ్స్​ అలర్ట్​గా ఉండాలని ఆదేశిస్తుంటారు. సిటీలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచిస్తుంటారు. సరిపడా డిజాస్టర్ ​రెస్క్యూ టీమ్స్​ఉన్నాయా? లేదా? అని అసలు పట్టించుకోవడం లేదు. 

గ్రేటర్ వ్యాప్తంగా 27 టీమ్స్ మాత్రమే..

గ్రేటర్ పరిధిలో డీఆర్ఎఫ్ టీమ్స్​ రాజ్ భవన్, జీవీకే మాల్, ఫతుల్లాగూడలో రెండు , గుడిమల్కాపూర్, కూకట్ పల్లి జంక్షన్, మలక్ పేట్, ఉప్పల్, మెట్టుగూడ, శిల్పారామం, ఓయూ క్యాంపస్, షేక్​పేట, చంపాపేట, మియాపూర్ మెట్రో స్టేషన్, ఎల్​బీనగర్, చాంద్రాయణగుట్ట, గచ్చిబౌలి స్టేడియం, సుజనా ఫోరంమాల్, సుచిత్ర, కాచిగూడ, సెక్రటరియేట్, వనస్థలిపురం, మెహిదీపట్నం ప్రాంతాల్లో అందుబాటులో ఉంటున్నాయి. మొత్తం 27 టీమ్స్ ఉన్నాయి.  ఇందులో  మినీ టీమ్స్​లో 15 మంది చొప్పున పని చేస్తున్నారు. ఒక షిఫ్ట్​లో ఐదుగురు డ్యూటీలో ఉంటారు. పెద్ద వెహికల్స్​ ఒక్కో టీమ్​లో 21 మంది ఉండగా, ఒక్కో షిఫ్ట్​లో ఏడుగురు పని చేస్తున్నారు. ఇలా మొత్తం డీఆర్ఎఫ్ లో 450 మంది ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. 

కన్వర్జెన్సీ మీటింగ్ లో చర్చిస్తాం 

డీఆర్ఎఫ్ టీమ్స్​సేవలు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 27 టీమ్స్ పై  చాలా వర్క్ లోడ్ ఉంది. ముఖ్యంగా వానలు పడ్డప్పుడు  ఫిర్యాదులు చాలా వస్తున్నాయి. వెంటనే వెళ్లి డీఆర్ఎఫ్ టీమ్స్ చర్యలు తీసుకుంటున్నాయి.  మరిన్ని టీమ్స్​ని నియమించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం.  దీనిపై కన్వర్జెన్సీ మీటింగ్ లో కమిషనర్ తో మాట్లాడి నిర్ణయం తీసుకొని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళుతాను. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. నేను కూడా చాలా కాలనీల్లో పర్యటించాను. ఎక్కడ కూడా ఇబ్బందులు  అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  

– గద్వాల్ విజయలక్ష్మి,మేయర్