పాలకంటే మందే ఎక్కువ తాగుతున్నరు

పాలకంటే మందే ఎక్కువ తాగుతున్నరు
  • పాల కంటే పదింతలు అధిక ఖర్చు..  రాష్ట్రమంతా ఇదే తీరు
  • ఏటా పెరుగుతున్న లిక్కర్​ అమ్మకాలు
  • కళ్లు బైర్లు గమ్మేలా ఆబ్కారీ లెక్కలు

వరంగల్‍  రూరల్‍, వెలుగు‘పాలు పౌష్టికాహారం.. రోజూ ఉదయం, సాయంత్రం గ్లాసు పాలు తాగితే ఆరోగ్యానికి మంచిది’ ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. రోజూ మందు తాగితే ప్రాణాంతకం’ డాక్టర్లు, హెల్త్ ఎక్స్​పర్ట్స్​ ఎప్పుడూ చెప్పే మాటలివీ. కానీ ఈ సలహాలను మందుబాబులు అసలు పట్టించుకుంటున్నట్టే లేదు. పాలు తాగడం కంటే.. లిక్కర్​ తాగడంపైనే ఎక్కువ ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. బాటిళ్లకు బాటిళ్లు మందును గుటుక్కుమనిపిస్తున్నారు. లిక్కర్​ తాగితే ఆ కిక్కే వేరప్ప అన్న స్టైల్​లో ఉంది వారి వ్యవహారం. రెండేళ్ల మద్యం పాలసీ గడువు ముగిసి.. కొత్త విధానం అమలులోకి వస్తున్న నేపథ్యంలో మచ్చుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో లిక్కర్​ డేటాను పరిశీలిస్తే కళ్లు తిరిగే వాస్తవాలు తెలిశాయి. ఉమ్మడి వరంగల్​ జిల్లాలో పాలు, చాయ్, కాఫీ రూపంలో ప్రతిరోజూ సుమారు లక్ష లీటర్ల వరకూ పాలు తాగుతుండగా.. మందు వాడకం మాత్రం దానికి డబుల్​ రేంజ్​లో ఉంది. పాలకు రెండు రెట్లు అధికంగా బీర్​, విస్కీ, బ్రాందీ, వైన్​ ఇలా అన్ని రకాల లిక్కర్​ కలిపి దాదాపు రెండు లక్షల లీటర్ల వరకూ మందుబాబులు తాగేస్తున్నారట.

ఉమ్మడి వరంగల్‍జిల్లా పరిధిలో ఒకప్పుడు  కల్లు ప్రియులు ఎక్కువగా ఉండేవారు. రైతులు, ఇతర కాయాకష్టం చేసే వారంతా తెల్లకల్లే తాగేవారు. అరుదుగా తప్ప ఎర్ర మందు (ఇంగ్లీష్​ మద్యం) ముట్టకపోయేవారు. కానీ కాలంతో పాటు పరిస్థితులు మారాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా  వైన్స్​లు వెలిశాయి. బెల్టుషాపుల పుణ్యమా అని వాడవాడలా మద్యం ఏరులై పారసాగింది. ఫలితంగా తెల్లకల్లుకు ఎన్నో రెట్లు మద్యం అమ్మకాలు పెరిగాయి. గత కొన్నేళ్లుగా లిక్కర్​ తాగేవారి సంఖ్య అంతకంతకూ రెట్టిస్తోంది.  ఒకప్పుడు పండుగో, పబ్బమో, ఇంటికి చుట్టాలొస్తేనో మందు తాగేవాళ్లు. ఇప్పుడా పరిస్థితిలేదు. చేతుల్లో పైసలు ఆడుతుండడంతో  కొందరికి నిత్యం పండుగే అవుతోంది.  వయోజనులకు పోటీగా యువత కూడా తాగుడుకు అలవాటు పడడంతో  లిక్కర్​ అమ్మకాలు జెట్‍స్పీడుతో దూసుకుపోతున్నాయి.  అబ్కారోళ్ల అమ్మకాల్లో ఏటా వాళ్ల రికార్డులను వాళ్లే తిరగరాసుకుంటున్నారు. 2017– 19 లైసెన్సులు ఇచ్చేనాటికి వరంగల్‍ఉమ్మడి ఐదు జిల్లాల్లో కలిపి  120 బార్లు, 266 వైన్‍షాపులు ఉన్నాయి.  2017లో రూ.2,863 కోట్ల వ్యాపారం జరిగితే, 2018–19లో రూ.3,272 కోట్ల బిజినెస్‍ జరిగింది. అంటే ఒక్క ఏడాదిలో రూ.409 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు పెరిగాయన్నమాట! అది మరింత పెరిగి 2019 సెప్టెంబర్​ చివర కల్లా  రూ.4,348 కోట్లకు చేరింది.

రోజువారీ పాల ఖర్చు రూ.66 లక్షలు

ఇంట్లో పాలు తాగే చంటి పిల్లలున్నా, ఇన్ని హోటళ్లు, కేఫులు నడుస్తున్నా, ఒక్కొక్కరు రోజుకు రెండుమూడు సార్లు ఛాయ్, కాఫీ తాగుతున్నా ఉమ్మడి వరంగల్​ జిల్లాలో గరిష్ఠంగా రోజుకు లక్ష నుంచి లక్ష పదివేల లీటర్ల పాలు మాత్రమే అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం లీటర్​ పాల ధర సగటున రూ.66 పలుకుతోంది. అంటే నిత్యం జిల్లావాసులు పాల కోసం  రూ.66 లక్షల నుంచి 70 లక్షలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు.

రోజూవారీ లిక్కర్​ ఖర్చు రూ.6 కోట్లు

పాలతో పోలిస్తే లిక్కర్​ కోసం మందుబాబులు చేస్తున్న ఖర్చు దాదాపు పది రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఉమ్మడి వరంగల్​ జిల్లావ్యాప్తంగా విస్కీ, బ్రాందీ, బీర్అమ్మకాలను పరిశీలిస్తే  ఈ విషయం మనకు  బోధపడుతుంది. ఎక్సైజ్​ శాఖ అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 2017–19 సీజన్​లో 73,02,254 మద్యం కాటన్లు, 1,01, 44, 090 బీర్​ కాటన్లు విక్రయించారు. ఈ రకంగా జిల్లాలో మందుబాబులు గడిచిన రెండేళ్లలో మద్యం కోసం  అక్షరాలా రూ.4348.55 కోట్లు ఖర్చు చేశారు. అంటే సగటున రోజుకు రూ.6 కోట్లు అన్నమాట. ఇదే జనం పాల కోసం రోజుకు సగటున చేసిన ఖర్చు కేవలం రూ.66 లక్షలు మాత్రమే!

డబుల్​ ఇలా..

ఒక్క విస్కీ, బ్రాందీ ఫుల్​ బాటిల్​ 750 ఎంఎల్. అంటే 12 ఫుల్​ బాటిళ్లతో కూడిన కాటన్​లో 9 లీటర్లు మద్యం  ఉంటుంది. ఈ విధంగా రెండేళ్లలో అమ్మిన కాటన్లు 73,02,254. అంటే 6,57,20,286 లీటర్లు అవుతోంది. అదే విధంగా ఒక్కో బీర్650 ఎంఎల్. ఒక్కో పెట్టెలో 12 బీర్ల చొప్పున లెక్కిస్తే  7.8 లీటర్లు.  రెండేళ్లలో అమ్మిన బీరు కేసులు101,44,090. అంటే 7,91,23,902 లీటర్లు. బీరు, విస్కీ కలిపి మనోళ్లు తాగింది మొత్తం 14,48,44,188 లీటర్లు. (14 కోట్ల పైచిలుకు) రెండేళ్లలో రోజు చొప్పున దీనిని లెక్కిస్తే  సరాసరి రోజుకు 2 లక్షల లీటర్లు. అంటే పాల కంటే డబుల్అన్నమాట. ఇంటిల్లిపాది, పిల్లలు అందరూ కలిసి తాగిన పాలు లక్ష లీటర్లు ఉంటే, మందుబాబులు తాగే లిక్కర్​ మాత్రం రెట్టింపు ఉండటం గమనార్హం. సమ్మక్క, సారలమ్మ జాతర, ఎలక్షన్ల టైంలో అన్ అఫీషియల్​గా రూ.కోట్లలో జరిగే  జీరో మద్యం వ్యాపారాన్ని కూడా కలిపి లెక్కిస్తే  పాలకు 3 రెట్లు తప్పక ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.