భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో తాగునీటి సమస్యలకు చెక్​ పడేనా?

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో తాగునీటి సమస్యలకు చెక్​ పడేనా?
  •      పల్లెల్లో కొనసాగుతున్న స్పెషల్​ఆఫీసర్ల సర్వే
  •      జిల్లాకు గోదావరి జలాలు అందిస్తామని గత సర్కారు ప్రకటించినా నిధులివ్వలే.. 
  •      భగీరథ పైపులైన్లు పగిలి నీళ్లు లీక్​ అవుతున్నా పట్టించుకోలే.. 
  •      కొత్త ప్రభుత్వ నిర్ణయంతో తాగునీటి తిప్పలు తప్పుతుందంటున్న అధికారులు

భద్రాచలం, వెలుగు  : కాంగ్రెస్​ ప్రభుత్వం తాగునీటి పథకాల నిర్వహణ బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించడంతో ఇకనైనా నీటి ఎద్దడికి చెక్​ పడుతుందని భద్రాద్రికొత్తగూడెం జిల్లా వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం స్థానిక సంస్థల పాలకమండళ్ల గడువు ముగియడంతో స్పెషల్ ఆఫీసర్లను నియమించిన సర్కారు వారితో గ్రామాల్లో తాగునీటి సమస్యలపై సర్వే చేయిస్తోంది. ఈనెల 7న ప్రారంభమైన ఈ సర్వే పది రోజులు కొనసాగనుంది. గత సర్కారు మిషన్​ భగీరథ స్కీం ద్వారా ఇంటింటికి గోదావరి జలాలను అందిస్తామని ప్రకటించి, నిర్వహణకు నిధులు ఇవ్వకుండా చేతులెత్తేసింది. 2018లో నిర్మించిన పైపులైన్లు పగిలి నీళ్లు లీక్​ అవుతున్నా   పట్టించుకోలేదు.  

ఫండ్స్.. పనులు..

మిషన్​ భగీరథ ఇంజినీర్ల ఎస్టిమేషన్ ​ప్రకారం పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్​ల నుంచి నిధులు ఖర్చు పెట్టనున్నారు. 15వ ప్రణాళిక సంఘం, జనరల్, ఎస్​ఎఫ్​సీ ఫండ్స్ తో పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్​శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ సందీప్​ కుమార్​ సుల్తానియా ఈనెల 1న  ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు స్పెషల్​ ఆఫీసర్లు పల్లెల్లో తాగునీటి సమస్యల గురించి సర్వే చేయిస్తున్నారు. 

ఫీల్డ్ లెవల్​లో చేసేది ఇలా.. 

ట్యాంకుల క్లోరినేషన్​, నీటి పంపింగ్​, సప్లై గురించిన వివరాలను లాగ్​ బుక్​లో ఎంటర్​ చేసేలా ప్రతీ పంచాయతీలో ఏర్పాట్లు చేస్తారు. స్పెషల్​ ఆఫీసర్లు గుర్తించిన సమస్యల ఆధారంగా ఏఈ స్థాయి ఇంజినీర్లు ఎస్టిమేషన్లు తయారు చేస్తారు. మిషన్​ భగీరథ స్కీం లేని గొత్తికోయల గ్రామాల్లో సోలార్​ ద్వారా పనిచేసే మోటార్లు, ట్యాంకులు, సమస్యల పరిష్కారం కోసం  యాక్షన్​ ప్లాన్​ రూపొందిస్తారు.  అయితే భద్రాచలం మన్యంలో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 21 హ్యాబిటేషన్లలో సోలార్​ తో పనిచేసే మోటర్లు, ట్యాంకులు ఉన్నాయి.

ఇందులో ఐదు చోట్ల  మోటర్లు పని చేయడం లేదు. ట్యాంకులు నిరుపయోగంగా మారాయి. ఇటువంటి వాటికి స్థానిక సంస్థల నిధులతో రిపేర్లు చేయిస్తారు. దుమ్ముగూడెం మండలంలో 37, చర్లలో 26, భద్రాచలం పంచాయతీల పరిధిలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు స్పెషల్​ ఆఫీసర్లు, మిషన్ ​భగీరథ ఇంజినీర్లు పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్​ తయారు చేస్తున్నారు. 

జిల్లా వ్యాప్తంగా 819 ఓవర్​ హెడ్​ ట్యాంకులు.. 

జిల్లా వ్యాప్తంగా 819 ఓవర్​ హెడ్​ ట్యాంకులు ఉన్నాయి. అశ్వాపురం మండలం కమ్మరిగూడెం ఇంటేక్​వెల్ పరిధిలో నాలుగు నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి 1,513 ఆవాసగ్రామాలకు గోదావరి జలాలను అందించాలనేది మిషన్ భగరీథ లక్ష్యం. 2,179 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణం చేయాలి. కానీ గత సర్కారు నిధులు సరిగ్గా ఇవ్వకపోవడం, నిర్వహణ గాలికొదిలేయడం తదితర కారణాలతో గోదావరి జలాల సరఫరా అంతంతమాత్రంగానే సాగుతోంది. సర్కారు తాజా నిర్ణయంతో  అన్ని గ్రామాలకు తాగునీరు అందే అవకాశం కనిపిస్తోంది.  

ఇక తాగునీటి సమస్యలు ఉండవ్​

ఇకపై తాగునీటి సమస్యలు ఉండవు. గిరిజన గ్రామాల్లో ఉన్న నీటి పథకాల నిర్వహణను పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్​లకు అప్పగించారు. ఆయా శాఖల నుంచి బడ్జెట్​తో లీకులు, ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణం, మోటార్ల రిపేరు ఇలా అన్ని పనులు చక్కదిద్దుకోవచ్చు. దీనిపై ఇప్పటికే సర్వే జరుగుతోంది. 
- శ్రీనివాసరావు, డీఈ, మిషన్​భగీరథ

ఇంటింటికీ తాగునీరు ఉట్టిదే.. 

గిరిజన గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరు అనే పథకం అంతా తుస్​. మిషన్ ​భగీరథ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు..  కానీ నీటి సరఫరాను మాత్రం మరిచారు. పైపులైన్లు లీకేజీ, కట్టిన ట్యాంకులకు నీటిని ఎక్కించకపోవడంతో గిరిజన గ్రామాలలో తాగునీటి తిప్పలు తప్పడం లేదు. ఎండాకాలం వచ్చిందంటే వాగు, చెలిమల నీళ్లే  దిక్కవుతున్నాయి.  
- ముద్దా పిచ్చయ్య, భద్రాచలం