బాక్సాఫీస్ వద్ద ‘జార్జ్‌కుట్టి’ ఊచకోత.. వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో ‘దృశ్యం 3’ !

బాక్సాఫీస్ వద్ద ‘జార్జ్‌కుట్టి’ ఊచకోత.. వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో ‘దృశ్యం 3’ !

మలయాళ సినీ ఇండస్ట్రీలో 'దృశ్యం' ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. థియేటర్లలోకి 'జార్జ్ కుట్టి' దిగాడంటే చాలు.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావాల్సిందే. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో  జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'దృశ్యం 3' (Drishyam 3) ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించింది. మిక్స్ డ్ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

బాక్సాఫీస్ వేట..

మోహన్ లాల్ బర్డ్ డే కానుకగా మే 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొదటి వారం రోజుల్లోనే ఏకంగా రూ. 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి మాలీవుడ్ హిస్టరీలోనే ఒక అరుదైన మైలు రాయిని అందుకుంది. కేవలం ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్ లోనూ.. ఈ మూవీ హవా నడుస్తోంది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ (US) బాక్సాఫీస్ వద్ద 1.2 మిలియన్ డాలర్ల మార్కును సులువుగా దాటేసి గ్లోబల్ మార్కెట్‌లో తన సత్తా చాటింది.

జార్జ్‌కుట్టి ఎమోషనల్ జర్నీ

సినిమా సక్సెస్ అనంతరం మోహన్‌లాల్ తన సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'మూడు సినిమాలు.. మూడు అధ్యాయాలు.. విడదీయరాని ఒకే ఒక్క బంధం! జార్జ్‌కుట్టి , ఫ్యామిలీతో కలిసి ప్రయాణించినందుకు అందరికీ ధన్యవాదాలు' అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈసారి సినిమాలో కేవలం ట్విస్టులు మాత్రమే కాకుండా, తప్పు చేశామనే బాధ, పశ్చాత్తాపం చుట్టూ తిరిగే ఎమోషనల్ డ్రామాను దర్శకుడు అద్భుతంగా చూపించారు.

ఆంటోనీ పెరుంబావూర్ నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ జాన్సన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ ఫ్రాంచైజీకి ప్రాణమైన ఒరిజినల్ స్టార్ కాస్ట్.. మీనా, సిద్ధిక్, ఆశా శరత్, మురళి గోపి, అన్సిబా హసన్, ఈస్తర్ అనిల్ మళ్లీ కలిసి నటించడంతో ఆడియన్స్‌కు పర్ఫెక్ట్ సీక్వెల్ ఫీల్ లభించింది. మొత్తానికి రివ్యూలతో సంబంధం లేకుండా జార్జ్‌కుట్టి మైండ్ గేమ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి..

ALSO READ : ‘కరుప్పు’ సక్సెస్ జోష్‌లో సూర్య..